త్వరలో పశువీర్య ఉత్పత్తి కేంద్రం ప్రారంభం : తలసాని

త్వరలో పశువీర్య ఉత్పత్తి కేంద్రం ప్రారంభం : తలసాని

హైదరాబాద్‌, వెలుగు : మృగశిర కార్తె సందర్భంగా అన్ని జిల్లాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. జూన్ 7 నుంచి మూడు రోజులపాటు నిర్వహించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని  మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను ఆయన ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన ఆఫీస్​లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖలపై మంత్రి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. రద్దీ ప్రాంతాల్లో కొత్తగా 100 మొబైల్ ఫిష్ ఔట్​లెట్ల  ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

అలాగే, హైదరాబాద్‌ శివారులోని కంసానిపల్లిలో కొత్తగా నిర్మించిన పశువీర్య ఉత్పత్తి కేంద్రం ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం కంసాన్ పల్లిలో 37 ఎకరాల విస్తీర్ణంలో రూ.22 కోట్లతో పశువీర్య ఉత్పత్తి కేంద్రం నిర్మాణం చేపట్టామని వివరించారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే సంవత్సరానికి 10 లక్షల డోసుల వీర్యం ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు.

సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్ గుప్తా, షీప్​ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, స్పెషల్‌ సీఎస్‌, విజయ డెయిరీ ఇన్​చార్జ్​ ఎండీ అదర్ సిన్హా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్‌ఎల్‌డీఏ మంజువాణి, వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీరోజీరావు పాల్గొన్నారు.