రోడ్డుపై చేపల లారీ బోల్తా..అద్దగంటల ఖాళీ

రోడ్డుపై చేపల లారీ బోల్తా..అద్దగంటల ఖాళీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద తెల్లవారుజామున చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడింది, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. చేపల కోసం ఎగబడ్డారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలతో పాటు..రోడ్డుపై వెళ్తున్న వారు..వాహనాలు ఆపేసి మరీ..చేపల పట్టుకునేందుకు పోటీ పడ్డారు. లారీ బోల్తా పడిన ఘటనలో ఎవరికైనా గాయాలు తగిలాయా? లారీ డ్రైవర్, క్లీనర్ పరిస్థితి ఎలా ఉందని కూడా జనం పట్టించుకోలేదు. 

చేపల లారీ బోల్తా పడటంతో చేపలన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో హైవే ..నీళ్లు లేని చేపల చెరువును తలపించింది. దీంతో గుంపులుగుంపులుగా చేపల కోసం ఎగబడ్డ జనం.. చేతికి అందిన కాడికి ఎత్తుకెళ్లారు. కొందరైతే బస్తాల్లో నింపుకెళ్లారు. 4వేల చేపలున్న లారీని...కేవలం అద్దగంటలో ఖాళీ చేసేయడం గమనార్హం. 

టన్నుల కొద్ది చేపలు..ఒక్కసారిగా రోడ్డుపై కనిపించడంతో.. వాహనాల రాకపోకలను సైతం లెక్కచేయకుండా జనం చేపల కోసం పోరాటం చేశారు. చెట్ల పొదల్లో పడిన చేపలను వదల్లేదు. పొదల్లోకి వెళ్లి మరీ..తమ సంచులు, ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసుకున్నారు. కొందరైతే...నాలుగు రోజుల పాటు చేపల కూరే తినేలా ప్లాన్ చేసుకుని మరీ చేపలను సేకరించారు. 

చేపల కోసం ఒక్కసారిగా పెద్దసంఖ్యలో జనం రావడంతో...హైవేలో ట్రాఫిక్ జాం అయింది.  విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే.. ఘటనస్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. ఓ దశలో చేపల కోసం ఎగబడిన ప్రజలను కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. పోలీసులు చెబుతున్నా..లేక్క చేయకుండా...ప్రజలు చేపలు ఎత్తుకెళ్లడం చూసి పోలీసులే విస్మయం వ్యక్తం చేశారు.