ఆస్ట్రేలియా దీవిలో ఇండోనేసియా మత్స్యకారుల అవస్థ

ఆస్ట్రేలియా దీవిలో ఇండోనేసియా మత్స్యకారుల అవస్థ

కాన్ బెర్రా: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్సకారులు తుఫానులో చిక్కుకున్నారు. భీకర గాలులకు నిర్మానుష్యమైన దీవికి కొట్టుకుపోయారు. రెండు బోట్లలో వెళ్లిన వారిలో దాదాపు సగం మంది గల్లంతయ్యారు. బోటు మునిగిపోవడంతో తిరిగి రాలేక, తినడానికి తిండిలేక అవస్థ పడ్డారు. ఆరు రోజుల తర్వాత అటుగా వచ్చిన తీర రక్షకదళం గమనించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇండోనేసియాకు చెందిన మత్స్యకారులను ఆస్ట్రేలియా కోస్ట్​ గార్డ్​ సిబ్బంది కాపాడారు.

అసలేం జరిగిందంటే..

ఇండోనేసియాకు చెందిన మత్సకారులు హిందూ మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లి తుఫానులో చిక్కుకున్నారు. ఇల్సా తుఫాను కారణంగా పెనుగాలులు వీయడంతో ఆస్ట్రేలియా తీరం వైపు కొట్టుకువెళ్లారు. వారి బోట్లు రెండూ దెబ్బతిన్నాయి. ఒక బోటులోని మత్స్యకారులలో 8 మంది గల్లంతయ్యారు, మిగతా వారు అలల ధాటికి నిర్మానుష్య దీవికి కొట్టుకెళ్లారు. ఆస్ట్రేలియా పశ్చిమ తీర ప్రాంతానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెడ్ వెల్  దీవికి చేరారు. బోట్లు దెబ్బతినడంతో అక్కడి నుంచి బయటపడే మార్గంలేకుండా పోయింది. దీంతో ఆ దీవిలోనే తిండీతిప్పలు లేకుండా సాయం కోసం ఎదురుచూస్తూ గడిపారు. ఆరు రోజుల తర్వాత హెలికాఫ్టర్​లో ఆ దీవి వైపు వచ్చిన ఆస్ట్రేలియా బార్డర్​ ఫోర్స్ సిబ్బంది కంటపడ్డారు. అయితే, దీవిలో మొత్తం ఇసుకే ఉండడంతో హెలికాఫ్టర్ ల్యాండ్​ చేసే వీలులేకుండా పోయింది. దీంతో వారిని కాపాడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని బార్డర్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు. ముందుగా వారిని ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం ఇండోనేసియాకు పంపించేశామని అధికారులు తెలిపారు.