
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని శ్రీసురక్ష దవాఖానాలో రూల్స్‌కు విరుద్ధంగా ఓ డిగ్రీ స్టూడెంట్‌కు అబార్షన్ చేస్తుండగా ఫిట్స్ వచ్చి చనిపోయింది. ఆమెను గర్భవతిని చేసిన వ్యక్తి అది పోవడానికి తెలిసిన మందులు ఇవ్వగా తీవ్ర రక్తస్రావమైంది. దీంతో యువతి కుటుంబసభ్యులకు తెలియకుండా ప్రైవేట్ దవాఖానాలో అడ్మిట్ చేశాడు. అక్కడ అబార్షన్ చేస్తుండగా యువతి ప్రాణాలు కోల్పోయింది.
పెండ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నా...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన యువతి పాల్వంచలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈమెకు ఇదే మండలం పకీరుతండాకు చెందిన భూక్యా నందుతో పరిచయం ఏర్పడింది. నందుకు అప్పటికే పెండ్లయి ముగ్గురు పిల్లలున్నారు. విషయం దాచి యువతిని ప్రేమ పేరుతో వంచించి శారీరకంగా దగ్గరయ్యాడు. గర్భం దాల్చగా పెళ్లి చేసుకోవాలని నందును నిలదీసింది. అబార్షన్ చేయించుకుంటేనే పెళ్లి అంటూ నమ్మబలికి ఆమెకు తినే ఆహారంలో కొన్ని మందులు కలిపి పెట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భద్రాచలంలోని సురక్ష దవాఖానాకు ఈనెల 17న మరో మహిళతో కలిసి తీసుకొచ్చాడు. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన యాజమాన్యం పట్టించుకోలేదు. అబార్షన్ చేస్తుండగా ఫిట్స్ రావడంతో నందు, వెంట వచ్చిన మహిళ పారిపోయారు. కొద్దిసేపటికే యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో హాస్పిటల్ మేనేజ్మెంట్ మృతురాలి కుటుంబీకులకు చెప్పడంతో వారు ఆదివాసీ సంఘాలతో కలిసి ఆందోళనకు దిగారు. డాక్టర్లు లోకేశ్, శ్రీకాంతిలపై కేసులు నమోదు చేయాలని, నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ నాగరాజురెడ్డి, టౌన్ ఎస్సై మధుప్రసాద్ వచ్చి సర్ధి చెప్పారు. భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సురేశ్‌కుమార్ దవాఖానాకు వచ్చి బాధిత కుటుంబం నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎంహెచ్ఓ దయానంద స్వామి, డిప్యూటీ డీఎంహెచ్ఓ హాస్పిటల్‌కు వచ్చి వివరాలు సేకరించి దవాఖానాను సీజ్‌చేశారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఘటనపై ఆరా తీశారు.