ఈజీ మనీ సంపాదనకు క్యాబ్ లు చోరీ

ఈజీ మనీ సంపాదనకు క్యాబ్ లు చోరీ

చందానగర్, వెలుగు: క్యాబ్ లను బుక్ చేసుకుని అందులో వెళ్తూ.. క్యాబ్ డ్రైవర్లను కొట్టి డబ్బులు, ఇతర వస్తువులు లాక్కొని కారుతో పారిపోతున్న ఐదుగురు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దుర్గా రామలింగప్రసాద్ తెలిపిన ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా గోకరాజుపాలెంకు చెందిన బాలగాని నాంచారయ్య , కంచాలవారి పాలెంకు చెందిన పిట్టు నాగిరెడ్డి, సింగోటి శివనాగరాజు, కృష్ణా జిల్లాకు చెందిన బోడి సుబ్బరాజు, బాచుపల్లికి చెందిన కేసన శివ కలిసి ఈజీగా మనీ సంపాదించేందుకు ప్లాన్ చేశారు. వీరు ఈనెల14న తెల్లవారుజామున మియాపూర్ మెట్రోస్టేషన్ నుంచి శంషాబాద్ కు క్యాబ్ మాట్లాడుకుని వెళ్లారు. 

శంషాబాద్ సమీపంలోకి వెళ్లగానే కారు ఆపమని  క్యాబ్ డ్రైవర్ బొంతు విజయ్ కుమార్ కు చెప్పారు. ఆపై ఐదుగురూ కలిసి క్యాబ్ డ్రైవర్ ను కొట్టి నోట్లో టవల్ కుక్కి కట్టేసి.. అదే కారులో చౌటుప్పల్ మల్కాపూర్ వద్ద దింపి.. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి అతని వద్ద రూ. 2,500 , ఫోన్, కారు తీసుకొని పారిపోయారు. బాధితుడు తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మియాపూర్ లోని బొల్లారం క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో వచ్చిన నాంచారయ్య నాగిరెడ్డి, శివ, నాగరాజు, శివ, సుబ్బరాజును అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా క్యాబ్ డ్రైవర్ ను కొట్టి కారుతో పరారైనట్టు చెప్పారు. ఇలా చోరీ చేసిన కార్లను గుంటూరు జిల్లా రాంబోట్లపాలెంకు చెందిన జూపూడి భూపేశ్వరరావు వద్ద తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని జల్సాలకు చేస్తున్నట్టు వివరించారు. గతంలో వీరు ఏపీలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. నిందితులను గురువారం రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.