అప్పు ఎగ్గొట్టేందుకు కొట్టి చంపారు!.. మహిళ హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

 అప్పు ఎగ్గొట్టేందుకు కొట్టి చంపారు!.. మహిళ హత్య కేసులో ఐదుగురు అరెస్ట్
  • ఆర్మూర్​ రూరల్​ సీఐ శ్రీధర్​రెడ్డి వెల్లడి

​నందిపేట, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో అప్పు ఎగ్గొట్టేందుకు మహిళను స్నేహితులే కొట్టి చంపారు. హత్యకు సంబంధించిన వివరాలను సోమవారం ఆర్మూర్​రూరల్​సీఐ శ్రీధర్​రెడ్డి మీడియాకు వెల్లడించారు. నందిపేటకు చెందిన ర్యాగల్ల గంగామణి (42), తన స్నేహితురాళ్లు బామని స్వరూప, అక్కా చెలెళ్లు దుబ్బాక లావణ్య, ప్రేమలకు రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల దాకా అప్పుగా ఇచ్చింది. 

కొద్ది రోజులుగా వడ్డీ చెల్లించకపోవడంతో గంగామణి నిలదీసింది.  అప్పు ఎగ్గొట్టేందుకు ఆమెను చంప్లాలని ప్లాన్ చేశారు. ఈనెల 2న నిర్మల్​జిల్లా బాసరకు వెళ్దామని గంగామణిని స్వరూప, లావణ్య నమ్మించి ఇద్దరూ బస్సులో వెళ్లారు. ప్రేమల, నరేశ్ దంపతులతో పాటు గంగామణి బైక్​పై వెళ్లారు. అక్కడ మాంత్రికుడి వద్ద పూజలు చేయించుకుని స్వరూప, లావణ్య తిరిగి బస్సులో ఇంటికి వెళ్లారు. 

బైక్ పై వెళ్లిన ముగ్గురూ తిరిగి వెళ్తూ.. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో నందిపేట తల్వేద వాగు బ్రిడ్జి వద్దకు రాగానే టాయిలెట్​వస్తున్నట్టు చెప్పి  ప్రేమల దంపతులు బైక్ దిగారు. గంగామణి టాయిలెట్​చేస్తుండగా వెంట తీసుకెళ్లిన సుత్తెతో వెనకనుంచి ఆమె తలపై రెండు దెబ్బలు కొట్టారు. కేకలు వేస్తూ పరుగెత్తగా ప్రేమల, నరేశ్​పట్టుకుని వాగులో తోసేశారు. 

అనంతరం స్వరూప, లావణ్యకు హత్య సమాచారం చెప్పి దంపతులు ఇంటికి వెళ్లిపోయారు. ఈనెల 3న గంగామణి డెడ్​బాడీ వాగులో కనిపించడంతో మృతురాలి కూతురు మేఘన ఫిర్యాదుతో కేసునమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  నిందితులను సోమవారం వెల్మల్​చౌరస్తా వద్ద పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు. విచారణలో మృతురాలి వదిన మగ్గిడి లావణ్య కూడా తమకు సహకరించినట్లు నిందితులు ఒప్పుకున్నట్టు చెప్పారు.