ఆదిలాబాద్: నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం...ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆదిలాబాద్: నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం...ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు  : నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన పాపిన్వార్ సునీల్ కుమార్ గతంల వివిధ సీడ్స్ కంపెనీల్లో సేల్స్​మెన్‌గా పనిచేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు, ఎరువుల దుకాణదారులతో పరిచయాలు పెంచుకున్నాడు. 2018లో హైదరాబాద్ లోని కొత్తపేటలో నిక్షితా అగ్రిటెక్​, జీనియస్​ క్రాప్ సైన్సెస్​పేర్లతో కంపెనీలు స్థాపించి సీడ్స్, బయో-పెస్టిసైడ్స్ వ్యాపారం ప్రారంభించాడు. ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో గుజరాత్ రాష్ట్రంలోని ఇదార్‌కు చెందిన గిరీశ్ పటేల్ నుంచి నాలుగేండ్లుగా నకిలీ పత్తి విత్తనాలు తెప్పిస్తున్నాడు. 

వీటిని ఇచ్చోడ మండలంలోని ధాబా-కే గ్రామానికి చెందిన ఈశ్వర్, ధాబా-బి గ్రామానికి చెందిన గణేశ్, మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు చెందిన సందేశ్ బండేవర్‌ల సహకారంతో రైతులకు అమ్ముతున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సునీల్ కుమార్ కు చెందిన గోడౌన్ లో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేని బయో-పెస్టిసైడ్స్, ఎక్స్ పైరీ అయిన విత్తనాలు, ప్యాకింగ్ మెటీరియల్, ముడిసరుకు, లేబుల్ ప్రింటింగ్, ప్యాకింగ్ మెషీన్లు, కారుతో పాటు 792 పింక్ బ్రాండ్ నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.