అంబర్ పేట్: ఐదుగురు నకిలీ పోలీసులు అరెస్ట్

అంబర్ పేట్: ఐదుగురు నకిలీ పోలీసులు అరెస్ట్

అంబర్ పేట్, వెలుగు: టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి, రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లిన నకిలీ పోలీసులను అంబర్ పేట క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అంబర్ పేటలోని సికింద్రాబాద్ జోన్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ  రక్షితమూర్తి వివరాలు వెల్లడించారు. జీడిమెట్లకు చెందిన మంచాల సంతోష్ కుమార్, గోల్నాక తులసీరామ్ నగర్ కు చెందిన సూర్య వంశీ సంతోష్ కుమార్ అలియాస్ సంతు, చాకలి శ్రీకాంత్ అలియాస్ చిన్న బొమ్మ, ఇటికల రఘువీర్, రామంతపూర్ కేసీఆర్ నగర్ కు చెందిన  బజనాద్రి దేవా, దీపక్ చెడు వ్యసనాలకు బానిసలై, ఈజీ మనీ కోసం నకిలీ పోలీసుల అవతారమెత్తారు. ఈ నెల 10న కూకట్ పల్లికి చెందిన రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారి కె.హరిబాబుకు తాము బంగారం కొంటామంటూ వాట్సాప్ మెసేజ్ పంపారు. ఇది నమ్మిన అతను మరుసటి రోజు సాయంత్రం వారు చెప్పినట్లు గోల్నాక వచ్చాడు. తర్వాత ఆ ఐదుగురు తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని, గోల్డ్ స్కామ్ లో నీ పాత్ర ఉందంటూ హరిబాబును బెదిరించారు. 

అతని ఫోన్ పే నుంచి రూ.21 వేలను రఘువీర్ అకౌంట్ కు ట్రాన్స్​ఫర్​చేయించారు. అతని క్రెడిట్ కార్డు తీసుకొని, పెట్రోల్ బంక్​లో రూ.20,640 స్వైప్ చేశారు. అనంతరం వైన్స్​కు తీసుకెళ్లి క్రెడిట్ కార్డు ద్వారా రూ.3 వేల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారు. ఆ సమయంలో బాధితుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఈ నెల 14న అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పోలీసులు మంగళవారం నకిలీ పోలీసులను అరెస్ట్​చేశారు. వారి వద్ద నుంచి రూ.26,500, ఐదు సెల్ ఫోన్లు, ఒక బైక్​స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. మరో నిందితుడు దీపక్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.