సెప్టిక్ ట్యాంక్‌లో పడిన చిన్నారి.. కాపాడేందుకు దిగి.. మొత్తం ఐదుగురు మృతి

సెప్టిక్ ట్యాంక్‌లో పడిన చిన్నారి.. కాపాడేందుకు దిగి.. మొత్తం ఐదుగురు మృతి
  • ఆగ్రా ఫతేహాబాద్ సమీపంలోని పత్రాపూర్ గ్రామంలో ఘటన

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలో ఉన్న ఫతేబాద్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా సెప్టిక్‌ ట్యాంక్‌లో పడిన చిన్నారిని కాపడటం కోసం ప్రయత్నించిన మరో నలుగురు కూడా మరణించారు. మృతుల్లో ముగ్గురు మైనర్లుఉన్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రతాపూర్‌ గ్రామంలో 12 అడుగుల లోతున్న సెప్టిక్ ట్యాంక్ ను మరమ్మత్తు చేపట్టారు. 3 రోజులుగా పైకప్పు తెరచే ఉంది. పదేళ్ల చిన్నారి అనురాగ్‌ శర్మ రోజు మాదిరిగానే ఆడుకునే క్రమంలో పైకప్పు తెరచి ఉన్న సెప్టిక్ ట్యాంకులోకి పడిపోయాడు. పెద్ద శబ్దం చేస్తూ పడిపోయిన అనురాగ్ (10) ఆర్తనాదాలు విన్న అతని సోదరులు హరిమోన్‌(17), అవినాశ్‌ శర్మ(16) పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే సెప్టిక్ ట్యాంకులోకి దిగారు. వీరికి సహాయంగా అంకుల్ సోను (32)తోపాటు వీరి పక్కింట్లో నివాసం ఉండే యోగేష్ బాఘేలాల్ (20) కూడా సెప్టిక్ ట్యాంకులోకి దిగారు. చిన్నారి అనురాగ్ శర్మ(10)ని కాపాడేందుకు సెప్టిక్ ట్యాంకులోకి దిగిన వీరంతా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడి కేకలు వేశారు. ఇరుగు పొరుగు వారొచ్చి సెప్టిక్ ట్యాంకులో పడిపోయిన ఐదుగురిని బయటకు తీసుకొచ్చి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో అందరూ చనిపోయారని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ వైద్యులు నిర్ధారించినట్లు జిల్లా ఎస్పీ బబ్లూ కుమార్ ప్రకటించారు.

ఘటనపై స్పందించిన సీఎం యోగి

సెప్టిక్ ట్యాంకులో పడి ఐదుగురు చనిపోయి ఘటనపై యూపీ సీఎ యోగి స్పందించారు. మృతుల్లో  నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం చాలా బాధకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరణించిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు.