
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాత్రి కాన్పూర్ లోని చమన్ గంజ్ ప్రాంతంలో ఉన్న నాలుగంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. బిల్డింగ్‌లోని మొదటి, రెండో అంతస్తుల్లో ఫుట్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. మిగిలిన రెండు అంతస్తుల్లో ఓ కుటుంబం నివసిస్తున్నది. ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఐదుగురు మరణించారు.
స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. నాలుగో అంతస్తు నుంచి ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా వారు చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తును ప్రారంభించామని పోలీసులు చెప్పారు. మంటలు బేస్ మెంట్లో ప్రారంభమై బిల్డింగ్‌ను చుట్టుముట్టాయని, పొరుగువారు గమనించేలోపే అంతటా వ్యాపించాయని పేర్కొన్నారు.