ధరణిపై రాష్ట్ర సర్కార్.. దిగొస్తున్నది

ధరణిపై రాష్ట్ర సర్కార్.. దిగొస్తున్నది
  • పోర్టల్ లో కొత్తగా ఐదు మాడ్యూల్స్ 
  • రెండింటిలో తహసీల్దార్లకు ఎంట్రీ ఆప్షన్ 
  • ఇన్ని రోజులుగా సమస్యలు ఉన్నాయని చెబుతున్నా పట్టించుకోని ప్రభుత్వం 
  • ధరణి అజెండాగా పాలిటిక్స్ మారడంతో తప్పులు సరిచేస్తున్న సర్కార్  

హైదరాబాద్, వెలుగు: ధరణిపై రాష్ట్ర సర్కార్ ఒక్కో మెట్టు దిగుతున్నది. పోర్టల్​లో లోపాలతో లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతుండడం.. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటనలు చేస్తుండడం.. గత కొన్ని రోజులుగా ధరణి అజెండాగానే పాలిటిక్స్ నడుస్తుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భూసమస్యల పరిష్కారానికి కొత్త మాడ్యూల్స్ తీసుకొస్తున్నది. ధరణి తెచ్చినంక దాదాపు మూడేండ్లకు కొన్ని మాడ్యూల్స్ లో తహసీల్దార్లకు ఎంట్రీ అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు శనివారం ఆదేశాలు ఇచ్చింది. 2020లో ధరణి పోర్టల్ తెచ్చిన ప్రభుత్వం.. అప్పటి నుంచి అందులో ఏ మార్పులు చేయాలన్నా పూర్తి అధికారం కలెక్టర్లకే కట్టబెట్టింది. తహసీల్దార్​లు, ఆర్డీఓలు కేవలం రిపోర్టులు మాత్రమే పంపేది.

అయితే కలెక్టర్లకు పని భారం పెరగడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటుండడంతో ధరణిలో లక్షలాది అప్లికేషన్లు పెండింగ్​లో ఉంటున్నాయి. ఈ క్రమంలో తమ వద్ద అప్లికేషన్లు పెండింగ్​లో లేవని చెప్పుకునేందుకు.. కలెక్టర్లు కనీసం అప్లికేషన్లను చూడకుండానే ఒకేసారి వేలాది దరఖాస్తులను రిజెక్ట్​ కొడుతున్నారు. దీంతో రైతుల్లో మరింత అసంతృప్తి పెరుగుతోంది. పైగా మళ్లీ చార్జీలు కట్టి కొత్తగా అప్లై చేసుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ధరణిలో మార్పులు చేయడంతో పాటు కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాలను తహసీల్దార్లకు అప్పగిస్తున్నారు. 

పొలిటికల్ హీట్​తో..  

రాష్ట్రంలో ధరణిపై పొలిటికల్ హీట్ రాజుకుంది. దీనికి తోడు ఎన్నికలు కూడా దగ్గరపడుతుండడంతో పోర్టల్​ను సెట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇన్నాళ్లు తాము ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు రోజుకోక మార్పు చేస్తున్నదని ఆఫీసర్లే అంటున్నారు. ధరణిలో అంతా బాగుందని చెప్పుకొస్తున్న సర్కార్.. కింది స్థాయిలో రైతులకు ఇబ్బందులు ఉన్న విషయం నిజమేనని గ్రహించి ధరణిని చక్కబెడుతోంది. ‘కిసాన్ సర్కార్’​ నినాదంతో ముందుకు పోతున్న తరుణంలో రాష్ట్ర రైతుల సమస్యలే పరిష్కరించలేకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తున్నది. ప్రతిపక్షాలు  కూడా రైతుల పక్షాన నిలిచి ధరణి విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఇప్పటికే ప్రకటించాయి. 

ఇవీ కొత్త మాడ్యూల్స్.. 

ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్​ప్రవేశపెట్టారు. ఇందులో ఫేక్ సర్వే నంబర్లు, సబ్​డివిజన్​ నంబర్లను తొలగించేందుకు తహసీల్దార్ల లాగిన్‌‌లో ఎంట్రీ ఆప్షన్ ఇచ్చారు. అయితే వీటికి మళ్లీ కలెక్టర్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్, ఆన్​సైన్​ఖాతాకు సంబంధించి కూడా తహసీల్దార్​ లాగిన్‌‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇక పట్టాదార్ పాస్​బుక్ లో మార్పులకు, సోల్డ్ అవుట్ కేసులకు సంబంధించి కలెక్టర్ లాగిన్ లో ఎంట్రీ ఆప్షన్ ఇచ్చారు. నోషనల్ ల్యాండ్స్ మిస్సింగ్​సర్వే నంబర్లకు సంబంధించి సిటిజన్ లాగిన్​లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.