
ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందగా నలుగురు గల్లంతయ్యారు. ఈత సరదా ప్రాణాలు తీసింది. నీటిలో మునిగి ఒకరు చనిపోగా, నలుగురు స్టూడెంట్లు గల్లంతయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల పరిధిలోని మానేరువాగులో ఈ ఘటన జరిగింది. సిరిసిల్ల టౌన్‌కు చెందిన 8 మంది స్టూడెంట్లు.. వెంకంపేట ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. సోమవారం మానేరువాగులోని చెక్ డ్యాంలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీటి లోతు తెలియక అందులోకి దిగిన ఐదుగురు మునిగిపోయారు. దీంతో మిగతా ముగ్గురు స్టూడెంట్లు భయంతో అక్కడి నుంచి పారిపోయారు.
వాగుకు దగ్గర్లో ఉన్న ఉన్న రైతులు.. పిల్లలు నీటిలో గల్లంతైన విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్‌కు చెందిన కొలిపాక గణేశ్ డెడ్ బాడీ దొరికింది. గల్లంతైన వెంకట సాయి, క్రాంతి, అజయ్, రాకేశ్.. సిరిసిల్ల పట్టణానికి చెందిన వాళ్లేనని తెలిసింది. గణేశ్ డెడ్‌బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.