న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తల సంబురాలు మిన్నంటాయి. సోమవారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన పట్టును నిరూపించుకోవడమే కాకుండా.. పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రంలో మెజార్టీ సీట్లను సాధించి అధికార తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టింది.
ఈ విజయంపై కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పటాకులు కాల్చుతూ, రంగులు పూసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ముఖ్యంగా కోల్‌కతాలోని సీఎం మమతా బెనర్జీ నివాసం బయట బీజేపీ మద్దతుదారులు భారీ నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహించడం అక్కడ మారిన రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతోంది.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, బలుర్‌ఘాట్ వంటి జిల్లాల్లో సైతం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు పార్టీ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ ఫలితాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
