హైదరాబాద్ రామంతాపూర్‎లో దారుణం: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి చంపేశాడు..!

హైదరాబాద్ రామంతాపూర్‎లో దారుణం: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి చంపేశాడు..!

హైదరాబాద్‎లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత హత్య చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‎లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‎గఢ్‎కు చెందిన ఈశ్వర్ పాండే, పులేశ్వరి పాండే దంపతులు రామంతాపూర్‎లోని కేసీఆర్ నగర్‎లో నివాసం ఉంటున్నారు. వీరికి పూనం(10), గడియ(8), మనోజ్ పాండే(5) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కుటుంబంతో కలిసి కేసీఆర్ నగర్‎లో ఉంటున్న ఈశ్వర్ పాండే స్థానికంగా ఉన్న ఓ టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో 2025, ఆగస్ట్ 12 ఈశ్వర్ పాండే కుమారుడు మనోజ్ పాండే తప్పిపోయాడు. ఈ మేరకు పోలీసులకు కంప్లైంట్ చేశాడు ఈశ్వర్ పాండే. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈశ్వర్ పాండే పని చేసే టింబర్ డిపోలోనే పని చేస్తోన్న బీహార్‎కు చెందిన కమర్ అనే వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. 

లైంగిక దాడి చేసిన అనంతరం విషయం బయటకు పొక్కకుండా బాలుడిని గొంతు నులిమి చంపేశాడు కమర్. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. హంతకుడు కమర్‎ని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఉప్పల్ పోలీసులు, బాలుడు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.  ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.