ఒకప్పుడు క్రికెట్ మొదలు ఏ స్పోర్ట్లోనైనా మగవాళ్లే కనిపించేవాళ్లు. తర్వాత మెల్లిమెల్లిగా అన్నిరకాల ఆటల్లోనూ మహిళలు చురుగ్గా పాల్గొని విజయాలు సాధించడం మొదలైంది. అందులో బాస్కెట్‌బాల్ ఆట కూడా ఒకటి. ఇందులో అమ్మాయిలు రోజురోజుకీ దూసుకుపోతున్నారు. అమెరికాలోని ‘ఉమెన్స్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (డబ్ల్యూఎన్బీఏ)’ ప్రతిఏటా బాస్కెట్‌బాల్ లీగ్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది అందులో ఆడేందుకు మన దేశానికి చెందిన ఐదుగురు అమ్మాయిలు ప్రయత్నిస్తున్నారు.
మన దేశ అమ్మాయిలేంటి? అమెరికా వాళ్లు నిర్వహించే బాస్కెట్‌బాల్ లీగ్‌లో ఆడటం ఏంటి? అనేగా మీ అనుమానం. ఈ ఐదుగురు అమ్మాయిలు ప్రస్తుతం అమెరికన్ స్కూల్, కాలేజీ, యూనివర్సిటీల్లో స్కాలర్‌షిప్‌లతో చదువుకుంటున్నారు. వీళ్లంతా ఇదివరకు ‘ఇండియన్ నేషనల్ బాస్కెట్‌బాల్ అకాడమీ’ నుంచి ఆడిన అమ్మాయిలే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ‘డబ్ల్యూఎన్బీఏ’లీగ్‌లో ఆడేందుకు కృషి చేస్తున్నారు. తర్వాత చదువులు పూర్తి చేసుకున్నాక.. వాళ్లంతా ఇండియా తరఫున ఆడాలని కోరుకుంటున్నారు కూడా.
అస్మత్ కౌర్ (16)

ఈ అమ్మాయి ప్రస్తుతం న్యూ జెర్సీలోని ‘ది లారెన్స్ విల్లే స్కూల్’లో చదువుకుంటూ.. బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె అమ్మా నాన్నలు బాగా చదువుకున్నవాళ్లు. నాన్న టెలికం సంస్థలో పని చేస్తున్నాడు. అమ్మ రచయిత్రి. ఐదేళ్ల వయసు నుంచే అస్మత్ జిల్లా, రాష్ట్రస్థాయి టోర్నమెంట్స్‌లో ఆడుతూ వస్తోంది. ఆమె కుటుంబం తండ్రి ట్రాన్స్ఫర్లతో చండీగఢ్, లక్నో, ఇండోర్, ముంబై ప్రాంతాలకు తిరుగుతూ ఉండేది. మొత్తానికి ముంబైలో ఉన్నప్పుడే ఆమెకు అమెరికాలోని ‘ది లారెన్స్విల్లే స్కూల్’లో స్కాలర్‌షిప్‌తో కూడుకున్న అడ్మిషన్ దొరికింది. అక్కడే చదువుకుంటూ, మరో పక్క బాస్కెట్‌బాల్‌లో రాణిస్తోంది. ప్రస్తుతం ఈ ఏడాది ‘డబ్ల్యూఎన్బీఏ’లీగ్‌లో ఆడేందుకు బాగా శ్రమ పడుతోంది.
సంజన రమేశ్ (17)

సంజనకు ఈ అథ్లెటిక్ జీన్స్ తల్లి నుంచే వచ్చేశాయి. వాళ్ల అమ్మ టెన్నికాయిట్, కో–కో ప్లేయర్. ఆమె తండ్రి ఐఐఎం బెంగళూరులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సంజన పదేళ్ల వయసప్పుడు బ్యాడ్మింటన్, పదకొండేళ్లప్పుడు షటిల్ బాగా ఆడేది. తర్వాత ఆమె ఇంట్రెస్ట్ బాస్కెట్‌బాల్‌పై మళ్లింది. ప్రస్తుతం సంజన ఫ్లాగ్స్టఫ్లోని ‘నార్త్ అరిజోనా యూనివర్సిటీ’లో చదువుకుంటూనే తన ఆటను కంటిన్యూ చేస్తోంది. ‘‘స్టూడెంట్ అథ్లెట్ లైఫ్ చాలా బిజీగా ఉంటుంది. ఎప్పుడూ క్లాసులు, ప్రాక్టీస్, తిండి, నిద్ర, హోంవర్క్‌తోనే నిండిపోతుంది. సోషల్ లైఫ్ అంటూ ఏమీ ఉండదు”అని చెప్తోంది. అలాగే ఇంటిని, ఇంట్లో వాళ్లను, ముఖ్యంగా ఇండియన్ ఫుడ్‌ని బాగా మిస్సవుతున్నానంటోంది సంజన..‘‘నేను బెంగళూరులో ఉన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్‌ని. కానీ అమెరికాకు వచ్చిన తర్వాత మ్యాథ్స్‌లో జీనియస్ అయ్యాను” అంటుంది.
వైష్ణవి యాదవ్ (17)

జీఆర్ఈలో మంచి స్కోర్ తెచ్చుకుని స్కాలర్షిప్ మీద అమెరికా వెళ్లింది వైష్ణవి. ఫ్లోరిడాలోని ‘పెన్సకోలా స్టేట్ కాలేజ్’లో చదువుకుంటూ.. ప్రస్తుతం ‘డబ్ల్యూఎన్బీఏ’లీగ్‌లో స్థానం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వారణాసి అమ్మాయికి గుండెధైర్యం చాలా ఎక్కువ. ఎందుకంటే అమెరికాలో ఉన్నప్పుడు తీవ్రంగా గాయాలపాలైంది. అప్పుడు కూడా ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండానే.. కేవలం హాస్టల్ ఫ్రెండ్స్, టీమ్ అఫీషియల్స్ సాయంతో ఏకంగా సర్జరీ చేయించుకోవడానికే సిద్ధమైంది. ‘‘నేను మంచి ప్లేయర్ అని నిరూపించుకోవాలి. దానికోసం ఎంతైనా కష్టపడతాను.” అంటోంది వైష్ణవి యాదవ్.
సృష్టి సురేన్ (18)
ఈ అమ్మాయి అమ్మానాన్నలు సురేన్, సునీత.. ఇద్దరూ ఒకప్పుడు చెన్నై సర్క్యూట్లో బాస్కెట్‌బాల్ ఆడేవాళ్లు. అలా సృష్టి కూడా మూడేళ్ల వయసు నుంచే తల్లితో కలిసి బాస్కెట్‌బాల్ ఆడటం ప్రారంభించింది. పన్నెండో తరగతి తర్వాత ఒక ఏడాది బాస్కెట్‌బాల్‌కు గ్యాప్ ఇచ్చి ఐఎంబీ అకాడమీలో కోచింగ్‌కి చేరింది. దానివల్లే ఆమె అమెరికాలోని ‘యూనివ్సరిటీ ఆఫ్ విన్నిపెగ్’లో స్కాలర్‌షిప్‌తో కూడిన అడ్మిషన్‌ని సంపాదించుకుంది. అక్కడ సైకాలజీ చదువుతూ బాస్కెట్‌బాల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ‘‘ఇక్కడ విన్నిపెగ్‌లో నేను ఎన్నో టెక్నిక్స్ నేర్చుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన కొత్తలో నా డైట్లో సరిపడా ప్రొటీన్ ఉండేది కాదు. దాంతో మెల్లిగా చికెన్‌పై ఇష్టం పెంచుకుంటూ అలవాటు చేసుకున్నా. మా అమ్మ వెజిటేరియన్ కావడం వల్ల ఇంట్లో నేను వెజ్ మాత్రమే తినేదాన్ని. నాన్న ఒక్కరే చికెన్ తినేవాళ్లు. ప్రస్తుతం నేను ’డబ్ల్యూఎన్బీఏ’లో చోటు కోసం ప్రయత్నిస్తున్నా. అదే జరిగితే మా నాన్న చాలా గర్వపడతారు” అంటోంది.
ఖుషి డోంగ్రే (18)

చిన్నప్పుడు చాలా ఏళ్లు రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది ఔరంగాబాద్కి చెందిన ఖుషి. లాయర్‌గా పని చేసే నాన్న ఎంకరేజ్‌మెంట్‌తో బాస్కెట్బాల్వైపు వెళ్లింది. మొదట్లో బాస్కెట్‌బాల్ కోర్టుకు వెళ్లినప్పుడు ఖుషిని చాలామంది ర్యాగింగ్ చేశారట. అప్పుడు ఆ విషయం ఆమె తన తండ్రికి చెప్పింది. దానికి వాళ్ల నాన్న… ‘‘నువ్వు నిజంగా ఆడాలనుకుంటే.. ఇలాంటివి పట్టించు కోకుండా మరింత కష్ట పడాలి” అని చెప్పారట. అప్పట్నించి మరింత ధైర్యంగా ఆడటం మొదలు పెట్టింది ఖుషి. కాలి మడిమకు తీవ్ర గాయ మవ్వడంతో చాలా ఏళ్లు నేషనల్స్‌కు ఆడలేకపోయింది. తర్వాత జిమ్‌కి వెళ్లి ట్రెడ్మిల్, బెంచ్ ప్రెస్ ప్రాక్టీస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఆమె ఆటల్లోనే కాదు.. చదువులోనూ మెరిట్ స్టూడెంట్. ప్రస్తుతం మియామీలోని ఏఎస్ఏ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతూ.. డబ్ల్యూఎన్బీఏ’ లో ఆడేందుకు రెడీ అవుతోంది.
