
- ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కంటోన్మెంట్, వెలుగు: హైదరాబాద్ విముక్తికి చిహ్నంగా బొల్లారంలోని రాష్ర్టపతి నిలయంలో నిర్మించిన చారిత్రాత్మక ఫ్లాగ్ పోస్ట్ ఇక నుంచి టూరిస్టులను ఆకట్టుకోనుంది. హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించిన తర్వాత త్రివర్ణ పతాకం ఎగురవేసిన జెండా ప్రతిరూపాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆవిష్కరించారు. ఆపరేషన్ పోలో తర్వాత 1948 సెప్టెంబర్ 17న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అసలు జెండా స్తంభం శిథిలావస్థకు చేరుకోగా 2010లో దానిని కూల్చివేశారు.
టేకు చెక్కతో ఫ్లాగ్ పోస్ట్ ను తయారు చేశారు. 15 మీటర్ల చదరపు విభాగాలు, 6 మీటర్ల వృత్తాకార విభాగం, ప్రతి ఒక్కటి ఎస్ఎస్ ప్లేట్లు, కాపర్ రాగి హోప్స్తో రూపొందించారు. దీని నిర్మాణానికి పాత జెండా ప్రాంతంలోని పది పునాదులు తిరిగి ఉపయోగించిన అధికారులు స్థిరత్వం కోసం నాలుగు కొత్త రాతి పునాదులు అదనంగా నిర్మించారు. రాత్రి సమయంలో వెలుగులు విరజిమ్మేందుకు ప్రతి మూలలో 4 మీటర్ల ఎత్తులో నాలుగు 250వాట్ల ఎల్ఈడీ ఫోకస్ లైట్లు ఏర్పాటు చేశారు.
దీంతో రాష్ట్రపతి నిలయంలో కొత్తగా ఆధునీకరించిన మేజ్ గార్డెన్, చిల్డ్రన్స్ పార్క్ , పునరుద్ధరించిన మూడు మెట్ల బావులను రాష్ర్టపతి ప్రారంభించారు. - జై హింద్ స్టెప్ వెల్, నక్షత్ర మెట్ల బావి, చిన్న బావి, నీటి భద్రతకు స్థానిక వనరుల స్థిరత్వం కోసం రాష్ట్రపతి నిలయంలో ఏటా13 మిలియన్ లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఇవి సాయపడతాయి. ఇవే కాకుండా నిలయంలో సందర్శకులను ఆకర్శించేందుకు శివుడు నంది ఎద్దుల శిల్పాన్ని రాష్ర్టపతి ప్రారంభించారు. ప్రిన్స్లీ స్టేట్స్, ఆపరేషన్ పోలో, లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ సమయంలో హైదరాబాద్ సంక్షోభం కథను వర్ణించే నాలెడ్జ్ గ్యాలఒరీ కొత్త ఎన్ క్లేవ్ ను కూడా ఆమె ప్రారంభించారు.