వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు

వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • భూపాలపల్లి, ములుగు జిల్లాలపై తీవ్ర ప్రభావం
  • కూలిన ఇండ్లు, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన రోడ్లు
  • వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • మత్తడి దుంకుతున్న 8,107 చెరువులు
  • నిర్మల్ జిల్లాలో ఒక్కరోజే 12.8 సెంటీమీటర్ల వర్షపాతం
  • మరో మూడు రోజులు వానలు

నెట్‌‌వర్క్, హైదరాబాద్, వెలుగు : మూడ్నాలుగు రోజులుగా దంచికొడుతున్న వానలు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినా.. వరద మాత్రం తగ్గడం లేదు. గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ​భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వందలాది అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఏజెన్సీలోని మన్యం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. గోదావరి నదిలో ఒకే రోజు 14 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదుకావడంతో  ఆఫీసర్లు తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు.

భూపాలపల్లి, ములుగు జిల్లాలపై వరదల ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. నాలుగో రోజు వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా భారీ వరదల వల్ల రోడ్లపై రాకపోకలకు వీలుకావడం లేదు. వందలాది గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఆదివారం రాత్రి 12.9 మీటర్ల ఎత్తులో, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం వద్ద 14.83 మీటర్ల ఎత్తులో గోదావరి వరద ప్రవహించడంతో ఆఫీసర్లు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం ఉదయం 8 గంటల వరకు 16.13 మీటర్లకు ప్రవాహం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 937 మంది ఆశ్రయం పొందుతున్నారు. మహాముత్తారం మండలం యత్నారం గ్రామం చుట్టూ నీరు చేరడంతో గ్రామస్థులంతా అడవికెళ్లి ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ కవర్లతో తాత్కాలిక డేరాలు వేసుకొని ఉంటున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వందలాది ఇళ్లు కూలిపోయాయి. వందలాది విద్యుత్​ స్తంభాలు, ట్రాన్స్​ఫార్మర్లు కూలిపోవడంతో గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి. భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలం అంబటిపల్లి, పెద్దంపేట గ్రామాల మధ్య రోడ్లు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా విజయవాడ నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌‌‌‌ను రప్పించి ఆ 2 గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు, గర్భిణులకు, అనారోగ్యంతో ఉన్న రోగులకు మందులను పడవ ద్వారా వెళ్లి అందించారు.

జల దిగ్బంధంలో మన్యం
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు జిల్లా కలెక్టర్ అనుదీప్​దురిశెట్టి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక, సాయంత్రం 4 గంటలకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద బాధితులకు సాయం అందించేందుకు జిల్లాలో 3 కంట్రోల్ ​రూంలు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 10.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోదావరి, దాని ఉపనదులు ఉప్పొంగడంతో భద్రాచలం వచ్చే అన్ని మార్గాలు మూసుకుపోయాయి. భద్రాద్రిని వరదల నుంచి రక్షించేందుకు కరకట్టలు నిర్మించినా స్లూయిజ్​లు మూసివేయడంతో డ్రైన్ బ్యాక్ వాటర్ కాలనీల్లోకి ప్రవేశించింది. పలు ఇండ్లలోకి నీరు చేరింది. భద్రాచలం నుంచి వాజేడు వెళ్లే మార్గంలో విలీన ఎటపాక మండల కేంద్రం, చెన్నంపేట, కన్నాయిగూడెం, దుమ్ముగూడెం మండలం గంగోలు, పర్ణశాల, చర్ల మండలం కుదునూరుల్లో రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి, బుర్రవేముల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలీన ఎటపాక, కూనవరం, వీఆర్​పురం, చింతూరులతో పాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. అశ్వాపురం మండలం చింతిరేల, నెల్లిపాక-బంజర, మణుగూరు మండలం కోడిపుంజుల వాగు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌లో చీకట్లో 30 గ్రామాలు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఐదో రోజూ వానతో జనం ఇబ్బందిపడ్డారు. చింతలమనేపల్లి మండలం దిందా గ్రామం జల దిగ్బంధంలోనే ఉంది. కాగజ్ నగర్ డివిజన్‌‌‌‌లో సుమారు 30 గ్రామాల ప్రజలు 4 రోజులుగా చీకట్లోనే ఉంటున్నారు. దహెగాం మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ఏదులబంధం వెళ్లే దారి అడవి మధ్యలో పెద్ద అలువవాగు కల్వర్ట్ వద్ద రోడ్డు తెగి 9 ఊళ్లకు రాకపోకలకు నిలిచిపోయాయి. చెన్నూర్ మండలంలోని బతుకమ్మ వాగు దగ్గర ట్రాన్స్​కో, ఎస్టీపీపీకి చెందిన 2 టవర్లు నేలకూలాయి. నిర్మల్ జిల్లాలో సోమవారం ఏకంగా 12.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో కడెం, గడ్డన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టులోకి 3,309 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

చెరువులకు జలకళ
రాష్ట్రంలో భారీ వర్షాలతో 8,107 చెరువులు మత్తడి దుంకుతున్నయ్‌‌‌‌. ఇంకో 8,641 చెరువులు నిండటానికి సిద్ధంగా ఉన్నాయి. 7,180 చెరువులు సగానికి పైగా నీళ్లు చేరాయి. మొత్తం 43,870 చెరువుల్లో 11,219 చెరువుల్లో పావు వంతు నీళ్లు మాత్రమే చేరాయి. 8,723 చెరువుల్లో సగంలోపు నీరు చేరింది. కాగా, రాష్ట్రంలో 15 చెరువు కట్టలకు గండ్లు పడ్డాయి. 

ఇయ్యాల కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్ మొత్తం మేఘావృతమై ఉంటుందని, మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప వర్షపాతాలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎండపల్లిలో 5.2 సెంటీమీటర్లు, కుమ్రంభీమ్ జిల్లా వెంకట్రావ్ పేటలో 5.1, భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్‌‌‌‌లో 5, అదే జిల్లా సర్వాయిపేటతోపాటు నిర్మల్ జిల్లా తాండ్ర, ములుగు జిల్లా వెంకటాపూర్ లో 4.5 చొప్పున వర్షపాతం నమోదైంది.

భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారంలో ఊరి చుట్టూ వరద నీరు చేరింది. దీంతో గిరిజనులు అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లతో డేరాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కోణంపేట అలుగువాగు ఉధృతికి మహాముత్తారం-  యామన్పల్లి మధ్య సీసీ రోడ్డు, పోలారం అలుగువాగు ఉధృతికి మహాముత్తారం - వజినేపల్లి మధ్య బీటీ రోడ్డు కొట్టుకుపోయాయి. కేశవాపూర్, నల్లగుంట మీనాజీపేట, నర్పింగాపూర్, యత్నారం, సింగంపల్లి, కనుకునూర్, రెడ్డిపల్లి మధ్య రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి.