బీఆర్ఎస్,బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ

బీఆర్ఎస్,బీజేపీల మధ్య  ఫ్లెక్సీల రగడ

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూఫ్ఖాన్ పేట గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. తమ  ఫ్లెక్సీలు కావాలనే తీయించారని బీజేపీ సర్పంచ్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ  ఘటనలో ఇరువర్గాల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఫ్లెక్సీల తొలగింపుతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య  రగడ మొదలైంది. అయితే ఇరు వర్గాలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా..వారితోనూ రెండు పార్టీల కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. 

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూఫ్ఖాన్ పేటలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి  పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా  గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుండి గ్రామానికి వచ్చిన నిధుల వివరాలతో ఫ్లెక్సీలు కట్టారు. ఈ గ్రామంలో  బీజేపీ మద్దతుగా గెలిచిన  సర్పంచ్ ఉండటంతో..తమ అనుమతి లేకుండా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  గ్రామ పంచాయితీ సిబ్బందితో  ఫ్లెక్సీలు తీయించారు. గ్రామానికి వచ్చిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని..ఫ్లెక్సీల్లో  తప్పుగా పేర్కొన్నారని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.