- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీ కట్టిన అభిమానులు
- అర్ధరాత్రి టైంలో తొలగించిన ఎమ్మెల్యే పల్లా వర్గీయులు
జనగామ, వెలుగు: జనగామ బీఆర్‌ఎస్ లీడర్లలో ఫ్లెక్సీ వార్ నెలకొంది. ఇక్కడి రాజకీయాలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిగా మారాయి. గురువారం ఎమ్మెల్సీ పోచంపల్లి బర్త్‌డే కావడంతో రావుల తిరుమల్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 10.30 గంటల టైంలో జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో భారీ ఫ్లెక్సీ కట్టారు. ఇది నచ్చని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరులు అర్ధరాత్రి టైంలో ఫ్లెక్సీని తొలగించారు. దీంతో ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీ కడితే దానిని పల్లా వర్గీయులు తొలగించడం సరికాదని పోచంపల్లి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా పల్లా, పోచంపల్లి మధ్య సఖ్యత దెబ్బతిన్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో జనగామ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి భంగపాటు ఎదురు కాగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి పోచంపల్లికి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో సఖ్యత కరువైంది. ఇదే క్రమంలో ఇటీవల కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. జనగామ నియోజకవర్గ శివారులోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గైర్హాజరు అయ్యారు. దీంతో పాటు తాజాగా జరిగిన ఫ్లెక్సీ చించివేత ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
