- విమాన టికెట్ ధరలను భారీగా పెంచడంపై ఆగ్రహం
- కిలోమీటర్లను బట్టి రేట్లు ఫిక్స్
- రూ.7,500 నుంచి రూ.18 వేల వరకు చార్జీలు
- ఇంకా తీరని ఇండిగో కష్టాలు.. మరో 800కు పైగా విమానాలు రద్దు
- ఇయ్యాల రాత్రిలోగా ప్యాసింజర్లకు రీఫండ్ ఇచ్చేయాలని కేంద్రం ఆదేశం
- సంస్థ సీఈవోతో నేరుగా పీఎంవో సంప్రదింపులు
- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు, బోగీలు ఏర్పాటు చేస్తున్న రైల్వే
న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని విమాన టికెట్ల రేట్లను విపరీతంగా పెంచిన ఎయిర్‌లైన్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. చార్జీల నియంత్రణకు చర్యలు చేపట్టింది. కిలోమీటర్ల వారీగా ఎంత చార్జీ వసూలు చేయాలనే దానిపై ఆదేశాలు జారీ చేసింది. అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయొద్దని పరిమితి విధించింది.
ఇకపై డొమెస్టిక్ ఫ్లైట్లలో ఎకానమీ క్లాసులో 500 కిలోమీటర్ల దూరం వరకు రూ.7,500 వసూలు చేయాలని ఆదేశించింది. 500–1,000 కిలోమీటర్ల వరకు రూ.12 వేలు, 1,000–1,500 కిలోమీటర్ల వరకు రూ.15 వేలు, 1,500 కిలోమీటర్లు దాటితే రూ.18 వేలు చార్జీ చేయాలని తెలిపింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో ఎయిర్‌లైన్ సంస్థలు టికెట్ రేట్లను భారీగా పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం.
అధిక చార్జీల భారం నుంచి ప్రయాణికులను కాపాడేందుకు మా అధికారాలను వినియోగించి టికెట్ రేట్లపై పరిమితులు విధిస్తున్నాం. పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయి. మా ఆదేశాలకు అనుగుణంగానే అన్ని ఎయిర్‌లైన్ సంస్థలు టికెట్ చార్జీలు వసూలు చేయాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించింది. తాము ఎప్పటికప్పుడు ఫ్లైట్ చార్జీలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
రీఫండ్ చెల్లింపుకు డెడ్‌లైన్..
ఇప్పటి వరకు రద్దయిన/ఆలస్యమైన విమానాలకు సంబంధించి ప్యాసింజర్లకు వెంటనే రీఫండ్ చెల్లించాలని ఇండిగో సంస్థను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆదేశించింది. ఈ ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటలకల్లా పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. ప్యాసింజర్ సపోర్ట్, రీఫండ్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఆటోమేటిక్ రీఫండ్ సిస్టమ్ అమల్లో ఉండాలని స్పష్టం చేసింది. విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులపై రీషెడ్యూలింగ్ చార్జీలు విధించవద్దని ఆదేశించింది.
రైల్వే స్పెషల్ సర్వీసులు..
దేశవ్యాప్తంగా విమానాల రద్దు నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు రైళ్లను నడుపుతున్నది. ముఖ్యమైన రూట్లలో అదనపు సర్వీసులతో పాటు బోగీలను ఏర్పాటు చేస్తున్నది. మొత్తం 37 రైళ్లలో 116 అదనపు బోగీలకు అనుమతి ఇచ్చింది. ఇక సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే సికింద్రాబాద్–చెన్నై, చర్లపల్లి–కోల్‌కతా, హైదరాబాద్–ముంబై రూట్లలో అదనపు సర్వీసులను నడుపుతున్నది.
ఐదో రోజూ ఫ్లైట్లు రద్దు..
ఇండిగో విమానాల రద్దు కొనసాగుతున్నది. ఆ సంస్థ వరుసగా ఐదో రోజు శనివారం కూడా పెద్ద సంఖ్యలో ఫ్లైట్లను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా 800కు పైగా విమానాలను క్యాన్సిల్ చేసింది. బెంగళూరులో 124, ముంబైలో 109, ఢిల్లీలో 106, హైదరాబాద్‌లో 66, పుణెలో 42, కోల్‌కతాలో 41, అహ్మదాబాద్‌లో 35, గోవాలో 14 ఫ్లైట్లను రద్దు చేసింది. తమ సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఇండిగో తెలిపింది. ‘‘శుక్రవారం వెయ్యికి పైగా విమానాలు రద్దు కాగా, శనివారం ఆ సంఖ్య తగ్గింది. 850లోపే విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గుతుంది. ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తున్నాం. రీఫండ్ కోసం మా వెబ్‌సైట్‌ను గానీ, కస్టమర్ సపోర్టు సెంటర్‌లో గానీ సంప్రదించాలి” అని ప్రకటనలో పేర్కొంది.
ఇండిగోపై పెనాల్టీ!
ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ శనివారం ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితులను అధికారులు ఆయనకు వివరించారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ (పీఎంవో) నేరుగా ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నది. విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు 10 రోజులు సమయం ఇవ్వాలని పీఎంవోను ఆయన అభ్యర్థించినట్టు తెలిసింది. అలాగే పైలెట్ డ్యూటీ రూల్స్ కఠినంగా ఉన్నాయని, వాటిల్లో కొంచెం సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే సమస్యను త్వరగా పరిష్కరించాలని ఇండిగో సీఈవోకు పీఎంవో స్పష్టం చేసినట్టు తెలిసింది. నిబంధనల ఉల్లంఘన, నిర్వహణ లోపాల నేపథ్యంలో ఇండిగోపై జరిమానా విధించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఇండిగో ఎయిర్ లైన్స్‌పై సుప్రీంలో పిటిషన్
విమానాలు తీవ్ర ఆలస్యం, రద్దు చేయడంతో ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు కాసిన ప్రయాణికులు ఇండిగో ఎయిర్ లైన్స్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీకి చెందిన అడ్వొకేట్ అమన్ బంకా ఈ విషయాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దృష్టికి తీసుకెళ్లి.. సుమోటో విచారణ జరిపించాలని అభ్యర్థించారు. జాతీయ స్థాయిలో ఏవియేషన్ ఇండస్ట్రీ కుప్పకూలిందని ఆయన ఆరోపించారు. ఇది హ్యుమానిటేరియన్ క్రైసిస్ కు దారితీసిందని, విమానాల ఆలస్యం వల్ల పిల్లలు, పెద్దలు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇబ్బందికి గురయ్యారని అడ్వొకేట్ చెప్పారు. మరోవైపు, విమానాల ఆలస్యం కారణంగా ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు రూ.500 కోట్లతో రిలీఫ్ ఫండ్ ప్రకటించాలని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యాత్రి సారథి ఆన్ లైన్ లో ప్రచారం చేపట్టింది.
