విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్: ఫ్లైట్‎లలో పవర్ బ్యాంక్‎ వినియోగంపై డీజీసీఏ నిషేధం

విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్: ఫ్లైట్‎లలో పవర్ బ్యాంక్‎ వినియోగంపై డీజీసీఏ నిషేధం

న్యూఢిల్లీ: విమాన భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం విధించింది. ఇటీవల విమానాల్లో పవర్ బ్యాంక్‎ల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీల్లో మంటలు చెలరేగిన వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డేంజరస్ గూడ్స్ అడ్వైజరీ పేరుతో డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (DGCA)  సర్క్యులర్ జారీ చేసింది. 

ఈ సర్క్యులర్ ప్రకారం.. విమాన ప్రయాణ సమయంలో ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్లలో పవర్ బ్యాంకులు, విడి లిథియం బ్యాటరీలను ఉంచడం నిషేధం. ఇకపై వీటిని ప్రత్యేక లగేజీలో కాకుండా మనమే క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే.. ప్రయాణీకులు ఇకపై తమ పవర్ బ్యాంక్‌లను విమానం సీటు పవర్ సాకెట్‌లకు కనెక్ట్ చేసి చార్జ్ చేసుకోవడానికి అనుమతి ఉండదు. 100 వాట్-అవర్స్ (27,000mAh) కంటే తక్కువ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌లు మాత్రమే విమాన ప్రయాణానికి అనుమతిస్తారు. 

నిషేధానికి ముఖ్య కారణం..?

సాధారణంగా పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లలో ఉపయోగించే లిథియం బ్యాటరీలు కొన్ని పరిస్థితుల్లో వేడెక్కడం, మంటలు అంటుకోవడం లేదా పేలిపోతుంటాయి. ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పవర్ బ్యాంకులు వంటి పరికరాల్లో లిథియం బ్యాటరీలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల మంటలు చెలరేగే అవకాశం ఉంది.

2025, అక్టోబర్ 19న ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం టేకాఫ్ అవుతుండగా ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్‎లో మంటలు చెలరేగాయి. క్యాబిన్ సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ తరహా ఘటనలు విమానాల్లో ఇటీవల ఎక్కువయ్యాయి. దీంతో అప్రమత్తమైన డీజీసీఏ భద్రతా చర్యల్లో భాగంగా విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం విధించింది. ముఖ్యంగా పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లను ఓవర్ హెడ్ బిన్‎లలో ఉంచినప్పుడు పొగ లేదా మంటలను గుర్తించడం కష్టతరమవుతోందని, ఇది విమాన భద్రతకు పెను ముప్పుని డీజీసీఏ పేర్కొంది. 

►ALSO READ | వాయు, జల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి..భారత్‌లో పెరుగుతున్న ఆరోగ్య ముప్పు..ఇండోర్ , గాంధీనగర్ ఘటనలే సాక్ష్యం!