ఫ్లైట్‌‌‌‌ టికెట్స్‌‌‌‌ బుకింగ్‌‌‌‌ పేరుతో మోసం

ఫ్లైట్‌‌‌‌ టికెట్స్‌‌‌‌ బుకింగ్‌‌‌‌ పేరుతో మోసం
  • ముందుగా టికెట్స్‌‌‌‌ బుక్‌‌‌‌ చేసి, తర్వాత క్యాన్సిల్‌‌‌‌ చేస్తూ రీఫండ్‌‌‌‌ తీసుకుంటున్న యువకుడు
  • మోసపోతున్న కన్సల్టెన్సీలు, చివర్లో ఆగమవుతున్న ప్రయాణికులు
  • మూడు పోలీస్‌‌‌‌స్టేషన్ల పరిధిలో కేసులు
  • యువకుడిని అరెస్ట్‌‌‌‌ చేసిన హనుమకొండ పోలీసులు

వరంగల్‍, వెలుగు : ప్రయాణికులకు ఫ్లైట్‌‌‌‌ టికెట్స్‌‌‌‌ బుక్‌‌‌‌ చేస్తూ, తర్వాత వారికి తెలియకుండా టికెట్లను క్యాన్సిల్‌‌‌‌ చేస్తూ డబ్బులు రీఫండ్‌‌‌‌ చేసుకుంటున్న యువకుడిని హనుమకొండ పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ సతీశ్‌‌‌‌ బుధవారం వెల్లడించారు. ఏపీలోని ఎన్‌‌‌‌టీఆర్‌‌‌‌ కృష్ణా జిల్లాకు చెందిన సాయితేజ ఏరోనాటికల్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ను మధ్యలోనే ఆపేసి కొంతకాలం చెన్నై ఎయిర్‌‌‌‌పోర్టులో పనిచేశాడు. జల్సాలకు అలవాటు పడ్డ సాయితేజ ఈజీ మనీ కోసం పక్కదారి పట్టాడు. ఎయిర్‍పోర్టులో పనిచేసే వారికి ఫైట్‌‌‌‌ టికెట్‌‌‌‌లో 20 శాతం డిస్కౌంట్‌‌‌‌ ఉంటుందని తెలుసుకొని అక్కడ పనిచేసే పలువురితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత పలు వెబ్‌‌‌‌సైట్ల నుంచి ఫ్లైట్‌‌‌‌ టికెట్‌‌‌‌ బుకింగ్‌‌‌‌ కన్సల్టెన్సీల ఫోన్‌‌‌‌ నంబర్లు సేకరించాడు.

వారికి ఫోన్‌‌‌‌ చేసి తాను ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఉద్యోగినని, 20 శాతం రాయితీ ఉన్నందున మిగతా వారి కంటే తక్కువకే ఫ్లైట్‌‌‌‌ టికెట్‌‌‌‌ ఇప్పిస్తానని నమ్మించాడు. అతడు మాట నమ్మిన కొన్ని కన్సల్టెన్సీలు తమ వద్దకు వచ్చే ప్రయాణికులకు అవసరమైన టికెట్లను సాయితేజ ద్వారా బుక్‌‌‌‌ చేయించడం మొదలు పెట్టారు. ఒకటి రెండు సార్లు సరిగానే చేసిన సాయితేజ తర్వాత మోసం చేయడం స్టార్ట్‌‌‌‌ చేశాడు. కన్సల్టెన్సీలు ప్రయాణికుల వివరాలు, డబ్బులు సెండ్‌‌‌‌ చేయగానే ఫ్లైట్‌‌‌‌ టికెట్స్‌‌‌‌ కొనుగోలు చేసి పంపించేవాడు. తర్వాత వారికి తెలియకుండా క్యాన్సిల్‌‌‌‌ చేస్తూ డబ్బులను రీఫండ్‌‌‌‌ చేసుకునేవాడు.

చివరి నిమిషంలో ప్రయాణికులు తమ టికెట్‌‌‌‌ క్యాన్సిల్‌‌‌‌ అయిన విషయాన్ని గ్రహించి కన్సల్టెన్సీల వద్దకు వచ్చేవారు. ఈ క్రమంలో కొన్ని కన్సల్టెన్సీలు తమ బ్రాండ్‌‌‌‌ చెడిపోవద్దన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ఎక్కువ ధర చెల్లించి ప్రయాణికులకు టిక్కెట్లు బుక్‌‌‌‌ చేసి పంపగా, మరికొన్ని చోట్ల గొడవలు జరిగాయి. దీంతో కన్సల్టెన్సీల నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. ఇలా ఏపీలోని ఎన్టీఆర్‍ కృష్ణా జిల్లా సూర్యారావుపేట పీఎస్‌‌‌‌తో పాటు, వరంగల్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పరిధిలోని హనుమకొండలో రెండు, సుబేదారి పీఎస్‌‌‌‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. దీంతో సాయితేజపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం ఏపీలో అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు సీఐ సతీశ్‌‌‌‌ తెలిపారు.