
- వీసా అవసరం లేని దేశాలకు ట్రావెల్ చేసినట్లుగా మాయ
- ఫ్లైట్ టికెట్ల గోల్‌మాల్‌తో మనీలాండరింగ్
- ఐదు ఫారెక్స్ ట్రేడర్ సంస్థల్లో ఈడీ సోదాలు
- ఫారిన్ కరెన్సీ, రూ.11.99 లక్షలు సీజ్
హైదరాబాద్, వెలుగు: ఫ్లైట్ టికెట్లను ఫోర్జరీ చేసి మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్న ఫారెక్స్ ట్రేడర్స్, ఎయిర్ ట్రావెల్ సర్వీసెస్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నజర్ పెట్టింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌కు విరుద్ధంగా నగదు లావాదేవీలు జరుపుతున్న ‘ఫుల్ ఫ్లేడ్జ్‌డ్ మనీ చేంజర్స్’(ఎఫ్‌ఎఫ్‌ఎమ్‌సీ) సంస్థల్లో గురువారం సోదాలు నిర్వహించింది.
హైదరాబాద్‌లో ప్రిజం ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, గరుడ ఫారెక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీవిమల్ నాథ్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, విక్టరీ ఫారెక్స్ , ట్రావెల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఏకకాలంలో తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో విదేశీ అక్రమ కరెన్సీ లావాదేవీల రికార్డులు, రూ.26.77 లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీ, లెక్కల్లో లేని రూ.11.99 లక్షలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.
ఫోర్జరీ విమాన టికెట్లతో ఫారిన్ ఎక్స్చేంజ్
హైదరాబాద్ కేంద్రంగా లక్డీకాపూల్, మెహిదీపట్నం సికింద్రాబాద్ సహా ఐదు ప్రాంతాల్లో ఫారెక్స్, ట్రావెల్స్‌లో ట్యాక్స్‌లు చెల్లింపులు లేకుండా అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది. ఈ ఏడాది జూన్, జులైలో ప్రిజం, గరుడ, శ్రీవిమల్ నాథ్, విక్టరీ ఫారెక్స్ అండ్ ట్రావెల్ సర్వీసెస్ సహా డిజిటల్ ఫారెక్స్ సంస్థల్లో ఆర్‌బీఐ అధికారులు ఇన్‌స్పెక్షన్ చేశారు. అక్రమంగా ఫారెక్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నట్లు గుర్తించారు.
ఆయా సంస్థల లైసెన్సులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్‌బీఐ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. ఎయిర్ ట్రావెల్ సర్వీసెస్‌లో కేవీసీ డాక్యుమెంట్లు లేకుండానే టికెట్లు జారీ చేస్తున్నట్లు గుర్తించారు.
నకిలీ ప్రయాణికుల పేర్లతో ఫోర్జరీ విమాన టిక్కెట్లు సృష్టిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. విమానాల తేదీలు, విమాన నంబర్ల తారుమారు, కస్టమర్ల సంతకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా ఒకే ప్రయాణ టికెట్‌ను ఫోర్జరీ చేస్తూ అనేక టికెట్లు తయారు చేస్తున్నట్లు ఈడీ సోదాల్లో వెలుగు చూసింది. వీసా అవసరం లేని ఇండోనేషియా, మాల్దీవులు, థాయిలాండ్, శ్రీలంక వంటి దేశాలకు ప్రయాణం చేసినట్లు సృష్టించిన ఎయిర్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.