ప్రకాశం బ్యారేజీకి 7 లక్షల క్యూసెక్కుల వరద

ప్రకాశం బ్యారేజీకి 7 లక్షల క్యూసెక్కుల వరద

కృష్నా నదికి తోడు ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవీటి వాగు

లంక గ్రామాలు.. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు, కలెక్టర్

విజయవాడ: కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. సుమారు 7 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రకాశం బ్యారీకి చేరుకుంటోంది. దీంతో బ్యారేజీ గేట్లన్నీ ఎత్తేశారు. వస్తున్న నీటిని వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ముప్పు తగ్గినా అధికారులు ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతిని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ యండి ఇంతియాజ్,  ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, సింహాద్రి రమేష్ లతో కలసి పర్యటించారు.

ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం- మంత్రి పేర్ని నాని

కృష్ణా నది వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులను, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా  మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాజధాని ముంపును నివారించే కొండవీటి ఎత్తిపోతల పధకం ద్వారా వాగు లో ప్రవహిస్తున్న వరదను క్రిష్ణానదిలోకి మళ్ళిస్తున్నామన్నారు.

కరకట్ట వద్ద ఉన్న కొండవీటి వాగు లిఫ్ట్‌ను అధికారులు ఆన్ చేశారు. అరటి, బొప్పాయి తోటల్లోకి వరద నీరు చేరుకుంటుండడంతో కొండవీటి వాగు లిఫ్ట్‌ స్కీమ్ వద్ద 5 మోటార్ల ద్వారా వాగు నీటిని నదిలోకి పంపిస్తున్నారు. పెనుమాక, ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుకుంటుండడంతో తప్పని పరిస్తితుల్లో అధికారులు కొండవీటి వాగు లిఫ్ట్‌ను ఆన్ చేశారు. కృష్ణా నది ఎగదన్నడంతో వాగులోకి ప్రవాహాలు ఎదురు వెళ్తున్నాయి.