సిటీ జలాశయాలకు కొనసాగుతున్న వరద 

 సిటీ జలాశయాలకు కొనసాగుతున్న వరద 
  • గేట్లు ఎత్తి నీటి విడుదల

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే రెండు జలాశయాలు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. రాత్రి 8 గంటల సమయానికి  ఉస్మాన్ సాగర్ కు 400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. అధికారులు రెండు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 408 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ గరిష్ట నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1786.20 అడుగులు ఉంది. నీటి సామర్థ్యం 3.900 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 3.050 టీఎంసీలు ఉంది. అలాగే హిమాయత్ సాగర్ కు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది.

స్వల్పంగా అంటే 150 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు 170 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఇన్ ఫ్లో స్వల్పంగా ఉండడంతో ఒక గేటును మాత్రం ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోవడంతో నిల్వ చేసే అవకాశం లేక దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. హిమాయత్ సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు, నీటి సామర్థ్యం 2.970 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1760.50 అడుగులతో 2.363 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు. ఒక గేటును మాత్రం ఎత్తి 170 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వస్తున్న వరద ప్రవాహాన్ని బట్టి నీటి విడుదల కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. 

గరిష్ట నీటిమట్టంతో హుస్సేన్ సాగర్

భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకుని నిండుకుండను తలపిస్తోంది.  నగరంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి.. ఆ నీరంతా వచ్చి హుస్సేన్ సాగర్ లో చేరుతోంది.  హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 513.45 అడుగులు ఉండగా..ప్రస్తుతం 513.41 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తున్నారు. మూడు ప్రధాన నాలాల నుంచి సాగర్ లోకి వరద నీరు వస్తోంది.