నెమ్మదించిన గోదావరి.. ఎస్సారెస్పీ గేట్లు క్లోజ్‌‌

నెమ్మదించిన గోదావరి.. ఎస్సారెస్పీ గేట్లు క్లోజ్‌‌
  • నెమ్మదించిన గోదావరి.. ఎస్సారెస్పీ గేట్లు క్లోజ్‌‌
  •  వరద కాలువ నుంచి మిడ్‌‌ మానేరుకు నీళ్లు
  • కాళేశ్వరం నుంచి భద్రాచలం దాకా ప్రమాదకరంగానే ప్రవాహం
  • కృష్ణా బేసిన్‌‌లో నారాయణపూర్‌‌ నుంచి జూరాలకు లక్షన్నర క్యూసెక్కులు
  • శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద

హైదరాబాద్‌‌, వెలుగు: వారం రోజుల పాటు తీర ప్రాంత జనజీవనాన్ని అతలాకుతలం చేసిన గోదావరి కాస్త శాంతించింది. ఎగువన రెండు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వరద తగ్గిపోయింది. కానీ కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు ఇంకా ప్రమాదకర స్థాయిలో ఉరకలెత్తుతున్నది. ఒకానొక దశలో మేడిగడ్డ వద్ద 29 లక్షల క్యూసెక్కులకు చేరువైన ప్రవాహం శనివారం రాత్రికి 10 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఇక్కడ ప్రవాహం కొంత తగ్గినా ఏటూరునాగారం నుంచి భద్రాచలం దాకా ఇంకా ప్రమాదం పొంచి ఉంది. ఇక మహారాష్ట్రతోపాటు లోకల్‌‌ క్యాచ్‌‌మెంట్‌‌లోనూ వర్షాలు లేకపోవడంతో శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు గేట్లు క్లోజ్‌‌ చేశారు. 

వరద కాలువ నుంచి మిడ్‌ మానేరుకు నీటి తరలింపును కొనసాగిస్తున్నారు. 10 వేల క్యూసెక్కులకు పైగా నీటిని ఎల్‌ఎండీకి విడుదల చేస్తున్నారు. మంజీరాలోనూ ప్రవాహం తగ్గింది. కడెం ప్రాజెక్టుకు వరద తగ్గింది. కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది. కర్నాటకలో వర్షాలు తగ్గడంతో కృష్ణా ప్రాజెక్టులకు 3, 4 రోజులు ఇన్‌ఫ్లో ఉండే అవకాశముంది. శ్రీశైలంలో తెలంగాణ జెన్‌కో శుక్రవారమే హైడల్‌ పవర్‌ జనరేషన్‌ స్టార్ట్‌ చేసింది. కృష్ణాలో మరో స్పెల్‌ వరదలు వచ్చే దాకా శ్రీశైలం పూర్తిగా నిండి నాగార్జునసాగర్‌లోకి భారీ ప్రవాహాలు వచ్చే అవకాశం లేదని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.

ఇంకా లక్షల క్యూసెక్కుల్లోనే వరద

మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కురిసిన వర్షాలతో కడెం, చత్తీస్‌గఢ్‌లో పడ్డ వానలతో వార్ధా, వైన్‌గంగా, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి, మేడిగడ్డ బ్యారేజీలకు వరదలు ముంచెత్తాయి. మేడిగడ్డకు దిగువన ఇంద్రావతి ఉధృతితో రామన్నగూడెం, ఏటూరునాగారం, మంగపేట, భద్రాచలం వరదలో చిక్కుకున్నాయి. ఎల్లంపల్లికి వరద శనివారం లక్ష క్యూసెక్కులకు తగ్గింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీకి వరద తగ్గింది. దీంతో మేడిగడ్డ బ్యారేజీకి గోదావరి నుంచి లక్ష క్యూసెక్కులు, ప్రాణహిత నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. మేడిగడ్డ నుంచి విడుదల చేస్తున్న లక్ష క్యూసెక్కులకు తోడు ఇంద్రావతి నుంచి వస్తున్న ఇంకో 3 లక్షల క్యూసెక్కుల వరద కలిసి తుపాకులగూడెం (సమ్మక్క సాగర్‌) బ్యారేజీకి 13 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ఆదివారానికి వరద తీవ్రత తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో కర్నాటకలోని ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతోంది. జూరాలకు నారాయణపూర్‌ నుంచి లక్షన్నర క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కులపైగా వరద వచ్చి చేరుతోంది.