కృష్ణా నదిలో తగ్గుముఖం పడుతున్న వరద.. రెండ్రోజుల్లో 2 లక్షల క్యూసెక్కుల మేర తగ్గిన ఉధృతి

కృష్ణా నదిలో తగ్గుముఖం పడుతున్న వరద.. రెండ్రోజుల్లో 2  లక్షల క్యూసెక్కుల మేర తగ్గిన ఉధృతి

ప్రస్తుతం వరద ప్రవాహం 3 లక్షల క్యూసెక్కులు

శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద 13 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

వర్షాలు దాదాపుగా నిలిచిపోవడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు.. స్థానికంగా కురుస్తున్న కొద్దిపాటి వర్షాలతో కృష్ణా నదిలో ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో వరద ఉధృతి 2 లక్షల క్యూసెక్కులు తగ్గిపోయింది. ఇది క్రమంగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షాలు కురిసినన్ని రోజులు కృష్ణానదిలో జూరాల నుండి శ్రీశైలం వరకు వరద ఉధృతి యావరేజీగా 5 లక్షలు ఉండగా.. నాగార్జునసాగర్ నుండి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు ఏడున్నర లక్షల క్యూసెక్కులకుపైగా వరద ఉధృతి నమోదైంది.  విజయవాడ పరిసరాల్లోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నా అధికారులు అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ సీజన్లో గరిష్ట స్థాయిలో శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నీటి విడుదల జరిగింది. అలాగే నాగార్జునసాగర్ వద్దకూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం శ్రీశైలం వద్ద 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

వరద ఉధృతి ఆరు లక్షల క్యూసెక్కులకు చేరిన సమయంలో శ్రీశైలం డ్యాం 10 గేట్లు 25 అడుగుల మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు పంపించారు. రెండు రోజులుగా తగ్గుముఖం పడుతుండడంతో వరద ప్రవాహానికి అనుగుణంగా గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. మొన్నటి వరకు శ్రీశైలం డ్యాం 10 గేట్లను 25 అడుగుల మేర ఎత్తి వరద నీటిని విడుదల చేసిన అధికారులు వరద తగ్గుతున్న కొద్దీ గేట్ల ఎత్తును 20 అడుగులు.. 15.. ఆ తర్వాత 10 అడుగులకు తగ్గించారు. వరద తగ్గుతున్న కొద్దీ గేట్ల ద్వారా నీటి విడుదలను తగ్గిస్తూ వస్తున్నారు. నాగార్జునసాగర్ వద్ద 18 గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదలను తాజా సమాచారం ప్రకారం 13 గేట్లకు పరిమితం చేశారు. ప్రస్తుతం వర్షాలు దాదాపుగా నిలిచిపోవడంతో కృష్ణా నదిలో వరద ఉధృతి కూడా క్రమ క్రమంగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

ఆల్మట్టి డ్యాం వద్ద..

పూర్తి స్థాయి నీటిమట్టం : 1705 అడుగులు (129.72టీఎంసీలు)

ప్రస్తుత నీటిమట్టం: 1704.72 అడుగులు (128.19 టీఎంసీలు)

ఇన్ ఫ్లో: 41 వేల 488 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో: 41 వేల 488 క్యూసెక్కులు

 

నారాయణపూర్ డ్యాం వద్ద:

పూర్తి స్థాయి నీటిమట్టం: 1615 అడుగులు (37.64 టీఎంసీలు)

ప్రస్తుత నీటిమట్టం: 1614.83 అడుగులు (37.51 టీఎంసీలు)

ఇన్ ఫ్లో: 58 వేల 823 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో: 50 వేల 578 క్యూసెక్కులు

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద

పూర్తి స్థాయి నీటిమట్టం: 1045 అడుగులు (9.66 టీఎంసీలు)

ప్రస్తుత నీటిమట్టం: 1043.93 అడుగులు (8.99 టీఎంసీలు)

ఇన్ ఫ్లో: 2 లక్షల 7 వేల 994 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో: 2 లక్షల 1 వేయి 570 క్యూసెక్కులు

 

తుంగభద్ర డ్యాం వద్ద

పూర్తి స్థాయి నీటిమట్టం: 1633 అడుగులు (100.86 టీఎంసీలు)

ప్రస్తుత నీటిమట్టం: 1633.00 అడుగులు (100 టీఎంసీలు)

ఇన్ ఫ్లో: 26 వేల 919 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో: 26 వేల 919 క్యూసెక్కులు

 

శ్రీశైలం డ్యామ్ వద్ద.. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

ఇన్ ఫ్లో:  3 లక్షల 11 వేల 748 క్యూసెక్కులు (సుంకేశుల మీదుగా 21 వేల క్యూసెక్కుల తుంగభద్ర వరద.. జూరాల మీదుగా 1 లక్ష 84 వేల క్యూసెక్కుల వరద)

శ్రీశైలం మొత్తం అవుట్  ఫ్లో: 3 లక్షల 24 వేల 461 క్యూసెక్కులు ( హంద్రీ-నీవాకు 2 వేలు, పోతిరెడ్డిపాడుకు 5 వేలు, డ్యామ్ కు దిగువన నాగార్జునసాగర్ కు 4 లక్షల 99 వేల క్యూసెక్కులు)

పూర్తి స్థాయి నీటిమట్టం: 885 అడుగులు (215.807 టీఎంసీలు)

ప్రస్తుత నీటిమట్టం: 884.30 అడుగులు (211.4759 టీఎంసీలు)

 

నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద 13క్రస్టు గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

ఇన్ ఫ్లో :3 లక్షల 13 వేల క్యూసెక్కులు.

అవుట్ ఫ్లో :2 లక్షల 73 వేల,358 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ  : 310.8510 టీఎంసీలు

పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం: 589.60అడుగులు

పులిచింతల ప్రాజెక్టు వద్ద

పూర్తి స్థాయి నీటిమట్టం: 175 అడుగులు (45.77 టీఎంసీలు)

ప్రస్తుత నీటిమట్టం: 174.01 అడుగులు (44.23 టీఎంసీలు)

ఇన్ ఫ్లో: 3 లక్షల 12 వేల 523 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో: 3 లక్షల 16 వేల 682 క్యూసెక్కులు