Samantha: ట్రైనర్ కే చెమటలు పట్టించిన సమంత.. వీడియో వైరల్!

Samantha: ట్రైనర్ కే చెమటలు పట్టించిన సమంత.. వీడియో వైరల్!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటన, అందంతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది సమంత రూత్ ప్రభు . కేవలం వెండితెరపై మెరిసే తారగానే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను అధిగమించి ధైర్యంగా నిలబడింది. అటు సినిమాల కోసం ఎంత కష్టపడుతుందో..  తన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి అంతకంటే ఎక్కువ శ్రమిస్తుంది సమంత.  లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ఫిట్‌నెస్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

జిమ్‌లో విశ్వరూపం

తాజాగా ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్ ఎమ్మీ వైట్ ఒక వింతైన, అత్యంత కష్టతరమైన ఛాలెంజ్‌ను విసిరారు. ఇది సాధారణ పుష్-అప్స్ కాదు. శరీరాన్ని గాలిలో బ్యాలెన్స్ చేస్తూ, ముందుకు వెనక్కు కదులుతూ.. ఒక చేత్తో వ్యతిరేక దిశలో ఉన్న కాలిని తాకాలి. ఈ ప్రక్రియలో శరీరం ఎక్కడా నేలకు తగలకూడదు. చూస్తున్న వారికే కళ్లు తిరిగే ఈ ఫీట్‌ను సమంత చాలా కూల్‌గా, అలవోకగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. మయోసైటిస్ వంటి వ్యాధితో పోరాడి వచ్చిన వ్యక్తి ఇంతటి కఠినమైన వర్కవుట్స్ చేస్తోందంటే.. ఆమె సంకల్ప బలానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

 

జీవితం విసిరిన సవాళ్లు.. 

సమంత జీవితం పూల బాట ఏమీ కాదు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే నాగచైతన్యతో విడాకులు, ఆ వెంటనే మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడటం ఆమెను కృంగదీశాయి. ఒకానొక దశలో కనీసం వెలుతురును కూడా చూడలేని స్థితి నుంచి, నేడు అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపించే స్థాయికి ఆమె చేరుకున్నారు. ఆమె కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఒక పోరాట యోధురాలు అని నిరూపించుకున్నారు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.

►ALSO READ | PEDDI: పెద్ది ఐటెం భామ లాక్.. రామ్ చరణ్‌తో స్టెప్పులేయనున్న స్టార్ బ్యూటీ.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

కొత్త జీవితం..

గత కొంతకాలంగా సమంత వ్యక్తిగత జీవితంపై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమెకు ఉన్న సాన్నిహిత్యంపై చర్చ నడిచింది. వీరు గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ ‘భూతశుద్ధ’ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. తన వ్యక్తిగత నిర్ణయాల పట్ల ఎంతో స్పష్టతతో ఉండే సమంత.. ఇప్పుడు తన జీవితంలోని సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు.

‘మా ఇంటి బంగారం’తో నిర్మాతగా..

ప్రస్తుతం సమంత కేవలం నటిగా మాత్రమే పరిమితం కాకుండా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా కూడా తన ముద్ర వేస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె నిర్మిస్తున్న  లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో సమంత ఒక పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో సమంత చేతిలో గన్ పట్టుకుని కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద మరోసారి సామ్ మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయమనిపిస్తోందంటున్నారు అభిమానులు.