- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ
- విడుదల చేసిన గిరిజన, పర్యాటక మంత్రిత్వ శాఖలు
హైదరాబాద్: గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3 కోట్ల 70లక్షలు విడుదల చేశాయి.
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం 'గిరిజన సర్క్యూట్ పేరిట' గతంలో రూ.80 కోట్లతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పలు అభివృద్ధి పనులను కూడా చేపట్టింది.
యునెస్కో గుర్తింపు లభించిన రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం రూ.140 కోట్లు ఖర్చుచేస్తోంది. అమ్మవా ర్లకు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌక ర్యార్థం జాతర జరిగే నాలుగు రోజుల పాటు, దక్షిణ మధ్య రైల్వే శాఖ 30 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది.
