సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలో చాలా మంది పారాశ్రామిక వేత్తలను బెదిరించి కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. సినిమా హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి లాభపడ్డారని ఆరోపించారు. స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయిందని సీఎం,పలువురు మంత్రులే చెప్పారన్నారు.. జడ్జిల ఫోన్లు, ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు బండి సంజయ్.
కేసీఆర్ కుటుంబమే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందన్నారు బండి సంజయ్. ఎలక్ట్రోర్ బాండ్ల పేరుతో బీఆర్ఎస్ కోట్లు వసూలు చేసిందన్నారు. ఎంత మంది ఆస్తులను జప్తు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావును కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇంత హడావుడి చేస్తున్న సిట్ ఏం సాధించిందని ప్రశ్నించారు బండి సంజయ్. ఇప్పటి వరకు ఒక్క రాజకీయ నేతను అరెస్ట్ చేయలేదన్నారు. కాంగ్రెస్ కొండను తవ్వి ఎలుకను పట్టుకోలేకపోతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు.
సిట్ విచారణ పేరుతో ప్రభుత్వం టైం పాస్ చేస్తుందన్నారు బండి సంజయ్ . స్వయంగా కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిందన్నారు. కేసీఆర్ భయానికి యాచకులు కూడా వాట్సప్ కాల్స్ మాట్లాడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ పై కంప్లైంట్ చేశానని తెలిపారు బండి సంజయ్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏర్పాటు చేసిన సిట్ లో ఆఫీసర్లు నిజాయితీ పరులని.. వారికి స్వేఛ్చనివ్వాలన్నారు బండి సంజయ్. అవినీతి ఆరోపణలను డైవర్ట్ చేయడానికి హడావిడి చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ సర్కార్ కు లేదన్నారు బండి సంజయ్. ఏఐసీసీ ఆఫీస్ కు ..ఫాంహౌస్ కు డీల్ కుదరడం లేదని అందుకే కేసును సాగదీస్తున్నారని చెప్పారు. అన్ని ఆధారాలుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తప్పు చేసిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకుంటేనే ప్రజలకు నమ్మకం కల్గుతుందన్నారు బండి సంజయ్.
