హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ చాలా దుర్మార్గుడు అని.. ఆయనకు క్యారెక్టర్ ఎక్కడుందన్నాడు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌లో కేటీఆర్ వివిధ రకాల నార్కోటిక్ సరఫరా పెంచిండని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లోని పబ్‌లు, క్లబ్‌లలో డ్రగ్స్ సప్లై పెంచిన ఘనత కేటీఆర్‌దని విమర్శించాడు. కేటీఆర్‌ను జైల్లో వేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి నూటికి నూరు శాతం అమ్ముడుపోయినట్లేనని అన్నాడు.
శుక్రవారం (జనవరి 23) కోరుట్ల పట్టణంలో పలువురు వ్యాపారవేత్తలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంపీ అర్వింద్ సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం పేరుతో కోట్లు మింగింది ఎవరు..? ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసింది ఎవరు..? ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ చేసిందెవరు..? ఫోన్ ట్యాపింగ్ చేయించిందెవరు..? పదేళ్లు తెలంగాణను దోచుకున్నది ఎవరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాల్లో కేటీఆర్ హస్తం లేకుంటే ఆయన కాలు ఉందా లేక కేసీఆర్ ముక్కు ఉందా అని ఎద్దేవా చేశారు.
►ALSO READ | సూట్ కేసుల నిండా గంజాయితో రైల్లో వెళ్తున్న మహిళ.. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు..
సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కంపెనీలనే దావోస్ తీసుకెళ్లి అక్కడ ఫొటోలు దిగుతున్నాడని.. తెలంగాణకు పెట్టుబడులు వచ్చిందేమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని సొంత పార్టీ తీవ్రంగా అవమానిస్తోందని అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డ జీవన్ రెడ్డిని ఈ వయసులో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని, ఆయనను కూర్చోబెట్టి మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎల్ రమణ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో వారికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. రైతులకు లాభం చేకూర్చడానికి పసుపు బోర్డు ప్రణాళిక బద్ధంగా పని చేస్తుందని తెలిపారు.
