ఓరుగల్లుకు తొలగని వరద ముప్పు

ఓరుగల్లుకు తొలగని వరద ముప్పు
  • మూడేండ్ల కింద వానలకు మునిగిన వరంగల్
  • భవిష్యత్​లో సమస్య రాకుండా చూడాలన్న కేటీఆర్​
  • ప్రపోజల్స్ ​పంపిస్తే ఒక్క పైసా రిలీజ్​ చేయలే.. 
  • నాలా ప్రొటెక్షన్​ పనులు ఏడియాడనే..
  • పూర్తి కాని సమ్మయ్యనగర్ అండర్ ​గ్రౌండ్​ డ్రైనేజీ
  • సాగుతున్న నయీంనగర్ ​నాలా వర్క్స్
  • కుచించుకుపోతున్న బొందివాగు నాలా

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో వరద నివారణ పనులు ముందుకు సాగడం లేదు. నాలాల అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైంది. మూడేండ్ల కింద కురిసిన భారీ వర్షాలకు వరంగల్​నగరంలోని వందల కాలనీలు నీట మునిగాయి. అప్పుడు సిటీకి వచ్చిన మంత్రులు భవిష్యత్తులో ముంపు ముప్పు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు ఆఫీసర్లు రూ.250 కోట్లతో ప్రపోజల్స్ పంపించగా.. ఇంతవరకు ప్రభుత్వం పైసా విడుదల చేయలేదు. అయినా కొన్ని పనులు మొదలుపెట్టినా అవి కూడా నత్తనడకనే సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వరంగల్​ వాసులకు ఈసారి కూడా ముంపు ముప్పు తప్పేలా లేదు.  

ఒక్క రూపాయి కూడా ఇయ్యలే..
2020 ఆగస్టు 15 అర్ధరాత్రి కురిసిన వర్షాలకు ఓరుగల్లులోని నాలాలు ఉప్పొంగాయి. కాకతీయులు నిర్మించిన చెరువుల గొలుసుకట్టు తెగిపోగా.. పైనుంచి వచ్చే వరదతో సిటీ మొత్తం జలమయమైంది.  దీంతో హైదరాబాద్​, విజయవాడ నుంచి బోట్లు, స్పెషల్​డీఆర్ఎఫ్​ సిబ్బందిని రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. వరద తాకిడికి నగరంలో కల్వర్టులు, డ్రైనేజీలతో పాటు నయీంనగర్​, బొందివాగు, భద్రకాళి నాలాల రిటైనింగ్ వాల్స్​ దెబ్బతిన్నాయి. దాదాపు 130 కాలనీల్లోకి నీళ్లు చేరి జనాలు పునరావాస కేంద్రాల బాట పట్టాల్సి వచ్చింది. పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లడం, జనాలు ఇండ్లు విడిచివెళ్లాల్సిన పరిస్థితి రావడంతో మంత్రి కేటీఆర్​ ఆగస్టు 18న నగరంలో పర్యటించారు. నాలాల ఆక్రమణలే ముంపుకు కారణమని గుర్తించి, వాటి కూల్చివేతకు ఆదేశాలిచ్చారు. మరోసారి ముంపు ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టేందుకు ప్రపోజల్స్​ రెడీ చేయాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. 2016  సెప్టెంబర్​లో కూడా ఇలాగే నగరాన్ని వరదలు ముంచెత్తగా..అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదనే ఉద్దేశంతో గ్రేటర్, ఇరిగేషన్​ఆఫీసర్లు దాదాపు రూ.250 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రపోజల్స్​ పంపి రెండున్నరేండ్లయినా ఇంతవరకు ప్రభుత్వం ఫండ్స్​ కేటాయించలేదు. దీంతో స్థానిక అధికారులు అందుబాటులో ఉన్న నిధులతో కొన్ని చోట్ల పనులు మొదలుపెట్టారు.  

నత్తనడకన నయీంనగర్​ నాలా పనులు 
వరదల సమయంలో హనుమకొండలోని సమ్మయ్యనగర్​ నాలా ఎక్కువగా డ్యామేజ్ ​కావడం, ఈ ప్రాంతం తరచూ ముంపునకు గురవుతుండటంతో ఆఫీసర్లు ఇక్కడ అండర్ గ్రౌండ్​ డ్రైనేజీకి ప్లాన్ ​చేశారు. స్మార్ట్​ సిటీ ఫండ్స్​ రూ.54  కోట్లతో పనులు మొదలుపెట్టారు. దాదాపు ఏడాదిన్నరగా సాగుతున్న వర్క్స్​ చివరి దశకు చేరుకున్నా ఫండ్స్​ రిలీజ్​ కాకపోవడంతో ఒకట్రెండు చోట్ల మిగిలి ఉన్న పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్​ ముందుకు రావడం లేదని తెలిసింది. దీంతో పాటు సమ్మయ్యనగర్​ నాలా నుంచి ప్రెసిడెన్సీ స్కూల్​వరకు 500 మీటర్ల మేర రెండు వైపులా రూ.12.58 కోట్లతో రిటైనింగ్​వాల్స్ కట్టాల్సి ఉండగా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రెసిడెన్సీ స్కూల్​ నుంచి నయీంనగర్​ బ్రిడ్జి వరకు మున్సిపల్​ ఫండ్స్ రూ.22 కోట్లతో పనులు ప్రారంభించగా నత్తనడకన సాగుతున్నాయి. నాలా నుంచి వచ్చే మురుగుతో ఇబ్బందులు తలెత్తుతుండగా మోటార్లతో  తోడుతూ పనులు చేయాల్సి వస్తోంది. వీటితో పాటు నయీంనగర్​ బ్రిడ్జి నుంచి కాకతీయ మెయిన్​ కెనాల్​వరకు రూ.58 కోట్లతో 1.5  కిలోమీటర్ల మేర రిటైనింగ్​ వాల్స్ ప్రతిపాదించగా.. ఇవి  కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికప్పుడు ఈ పనులన్నింటికీ ఆమోదం తెలిపి..టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తి చేసి.. పనులు ప్రారంభించినా పూర్తవడానికి కనీసం ఏడాదైనా పడుతుంది. ఒకవేళ ఈసారి భారీ వర్షాలు పడితే వరంగల్​ మళ్లీ మునగక తప్పదు.  

బొందివాగు సంగతి ఏమాయే.. 
వరదలు వస్తే  నగరంలోని నాలాలు 10 నుంచి 12 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని మించి తట్టుకోలేని స్థితిలో ఉన్నాయి. దీంతో 20 వేల క్యూసెక్కుల ప్రవాహాన్నైనా తట్టుకునేలా డెవలప్​ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సిటీలో ప్రధానమైన బొందివాగు నాలా..ఆక్రమణతో  ఇరుకుగా మారింది. దీంతో చాలాకాలనీలు ముంపునకు గురవుతున్నాయి. నివారణ చర్యల్లో భాగంగా ఈ నాలాను 20 మీటర్ల మేర విస్తరించాల్సి ఉంది. పైనుంచి వచ్చే వరదను నియంత్రించడానికి రామన్నపేట, గ్రీన్ ఉడ్​ స్కూల్ సమీపంలో రెండు చోట్ల ఇన్ ఫ్లో రెగ్యులేటర్లు, అలంకార్ కాపువాడ వైపు ఔట్ ఫ్లో రెగ్యులేటర్ నిర్మించాలని ప్రతిపాదించారు. తర్వాత పద్మాక్షి టెంపుల్ వైపు కూడా మరో ఇన్ పుట్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనులన్నింటికీ దాదాపు రూ.144 కోట్లు అవసరమని ప్రపోజల్స్ పంపించారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి పనులకు ఆమోదం లభించలేదు. రాను రాను ఆక్రమణలు పెరుగుతుండడంతో కుచించుకుపోతోంది. 

ప్రతిపాదనలు పంపించాం
నయీంనగర్​ వద్ద నాలా రిటైనింగ్ వాల్స్​పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని పనులు తొందర్లోనే మొదలయ్యే అవకాశం ఉంది. సమ్మయ్యనగర్ ​వద్ద అండర్​ గ్రౌండ్​డ్రైనేజీ పనులు కూడా పూర్తయ్యాయి. బొందివాగు నాలా డెవలప్​మెంట్​కు కూడా ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆ పనులు కూడా చేపడుతాం. నగరానికి ముంపు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటాం.
‌‌ -  బి.ఆంజనేయులు, ఇరిగేషన్​ ఈఈ