
గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయ్యింది. బుధవారం ( ఆగస్టు 27 ) నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్, కామారెడ్డి జగిత్యాల, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించి పోయింది. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ లో కప్పలవాగు పక్కన ఉన్న ఎక్సైజ్ ఆఫీసు చుట్టూ వరద చేరింది. దీంతో ఇద్దరు ఉద్యోగులు ఆఫీసులోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. గత రెండు రోజులుగా నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి సిద్ధిపేట జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండు కుండలా మారింది.
సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ నీట మునిగింది. కాలనీ రోడ్లపై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట మున్సిపల్ అధికారులు కాలనీలో నిలిచిన నీటిని తొలగించడానికి చర్యలు చేపట్టారు.