నాలాల అభివృద్ధితో వరద ముంపు లేకుండా చేస్తం

నాలాల అభివృద్ధితో వరద ముంపు లేకుండా చేస్తం

మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్​
ముషీరాబాద్, వెలుగు
: నాలాల సమగ్ర అభివృద్ధితో  వరద ముంపునకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అడిక్ మెట్​లో ఎస్ఎన్ డీపీ(స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్)లో భాగంగా రూ.12 కోట్లతో  చేపట్టిన నాగమయ్య కుంట నాలా అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, ఎమ్మెల్యే ముఠాగోపాల్ తో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. వానాకాలంలో నాలాకు పై నుంచి వచ్చే వరదనీటితో పరిసర కాలనీలు ముంపునకు గురవుతున్నాయన్నారు. హుస్సేన్ సాగర్ నుంచి అంబర్ పేట మీదుగా మూసీ వరకు ఉన్న నాగమయ్య  కుంట నాలాకు కిందటేడాది పై నుంచి వచ్చిన వరదతో స్థానికులు ఎంత ఇబ్బందిపడ్డారో తెలిసిందేనన్నారు. నాలా అభివృద్ధి పనుల్లో భాగంగా రెండు కొత్త బ్రిడ్జిలు, ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణాలు ఉంటాయన్నారు. ఈ పనులు పూర్తయితే ముషీరాబాద్ ప్రాంతంలోని వారాసిగూడ, పద్మారావు నగర్, పార్సిగుట్ట, రాంనగర్, వీఎస్‌‌‌‌టీ, విద్యానగర్, నల్లకుంట, పద్మ కాలనీలో ఉంటోన్న 8 వేల కుటుంబాలకు వరద ముంపు ఉండదన్నారు. కార్యక్రమంలో బల్దియా సీఈ కిషన్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ హరికృష్ణ, కార్పొరేటర్ సునీత, వాటర్ వర్క్స్ జీఎం సుబ్బ రాయుడు తదితరులు పాల్గొన్నారు.