- బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన వారికి వెంటనే పరిహారమివ్వాలి
- భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద బాధితులకు వివేక్ పరామర్శ
మహదేవపూర్, పెద్దపల్లి : రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వేల కోట్లను సీఎం కేసీఆర్ వెనకేసుకున్నారని, రైతుల బతుకును ఆగం చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్, వరదతో నష్టపోయిన వారందరికీ వెంటనే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో వరద బాధితులను వివేక్ పరామర్శించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం కేవలం కమీషన్ల ప్రాజెక్టు. కానీ ఓ టీఆర్ఎస్ నాయకుడేమో టీవీ డిబేట్‌లో కోటి ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు అని ప్రచారం చేస్తున్నాడు. ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి ఒక్క ఎకరాకు కూడా నీళ్లియ్యలే. పోయినేడు కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చాయి. ఇప్పుడు పంప్‌హౌస్ మొత్తం మునిగిపోయింది. వయబులిటీ లేని ప్రాజెక్టు కట్టిన, డిజైన్ గీసిన, కట్టించిన వారిపై విచారణ జరిపించాలి” అని డిమాండ్ చేశారు.
మా గోస పట్టించుకునే వాళ్లే లేరు: బాధితులు
‘‘సారూ.. మా బతుకులు ఆగమై వారం రోజులు అయితాంది. మేం ఓట్లేస్తే గెలిచిన వాళ్లు మమ్మల్ని చూడడానికి, మా గోస వినడానికి రాలే. మీరన్నా మా తరఫున మాట్లాడి మాకు న్యాయం చేయండి’’ అంటూ మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద దుకాణదారులు వివేక్‌కు మొరపెట్టుకున్నారు. కాళేశ్వరం, కన్నెపల్లి, పూస్కుపల్లి, మహదేవపూర్ గ్రామాల్లో వరద ప్రభావానికి గురైన వారిని ఆయన పరామర్శించారు. పూస్కుపల్లికి వెళ్లి ఇండ్లలోకి నీళ్లు వచ్చిన బొల్లం లక్ష్మి తదితరులను పరామర్శించారు. వివేక్ అక్కడే ఆర్డీవోకు ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
కాళేశ్వరం రీడిజైన్‌తోనే వరదలు
కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ మూలంగానే గ్రామాలు, పట్టణాలు వరదల పాలవుతున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. తర్వాత వివేక్ మాట్లాడుతూ.. ‘‘గతంలో ఉన్న తుమ్మిడిహట్టిని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. రూ.36 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల రైతులు ఏటా 40 వేల ఎకరాల పంట నష్టపోతున్నారు. మంథని పట్టణంలో వరద నీరు చేరుకొని జనజీవనం స్తంభించిపోయింది” అని చెప్పారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల నష్టం జరుగుతుందని గతంలో తాను పాదయాత్ర, ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల మూడేండ్లుగా రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. వరద బాధితులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. నష్టపోయిన వారిలో దళితులుంటే దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ మంథని మండల అధ్యక్షుడు వేల్పుల రాజు, మంథని టౌన్ అధ్యక్షుడు ఎడ్ల సదాశివ తదితరులు పాల్గొన్నారు.
