త్వరలో మునుగోడు ఉప ఎన్నిక ?

త్వరలో మునుగోడు ఉప ఎన్నిక ?
  • వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 
  • పెండింగ్​ హామీల అమలు, కొత్త వరాలపై అధికార పార్టీ ఫోకస్​
  • గట్టుప్పల్​ను మండలంగా ప్రకటించినందుకు నేడు కేసీఆర్​కు కృతజ్ఞత సభ​
  • సభతో జనంలోకి వెళ్లాలని చూస్తున్న టీఆర్ఎస్ నేతలు​ 
  • కోమటిరెడ్డి రాజగోపాల్​ఎపిసోడ్తో కాంగ్రెస్లో కలవరం
  • ఆయన పార్టీలో ఉన్నట్లా.. లేనట్లా.. అని ఆందోళన
  • ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవాలని వ్యూహం
  • నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి బీజేపీ కసరత్తు
  • దుబ్బాక, హుజూరాబాద్​ విజయాన్ని రిపీట్​ చేయాలని ప్లాన్​
  • రాష్ట్ర రాజకీయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న హైకమాండ్​


హైదరాబాద్, వెలుగు: మూడు ప్రధాన పార్టీల్లో మునుగోడు హీట్​ మొదలైంది. కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో కాంగ్రెస్​ సీనియర్​ లీడర్, మునుగోడు ఎమ్మెల్యే ​ కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి భేటీ అయ్యారన్న  వార్తలతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందనే ఊహాగానాలతో టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ అలర్ట్​ అయ్యాయి. అధికార టీఆర్​ఎస్​ అయితే.. అప్పుడే ఉప ఎన్నిక వచ్చేసినట్లుగా హడావుడి చేస్తున్నది.
పార్టీ బలగాన్ని మునుగోడులో మోహరిస్తున్నది.

ఎనిమిదేండ్లుగా పెండింగ్​లో పెట్టిన హామీలు, డిమాండ్లను ఇప్పుడు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే తెలంగాణపై స్పెషల్​ ఫోకస్​ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం.. రాష్ట్రంలోని పరిణామాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నది. జాతీయ నాయకత్వం డైరెక్షన్​లో రాష్ట్ర బీజేపీ నేతలు మునుగోడులో పార్టీ సంస్థాగత కమిటీలను బలోపేతం చేసే పనిలో ఉన్నారు. 
ఇక, తమ సిట్టింగ్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తాజా ఎపిసోడ్​ కాంగ్రెస్​ శ్రేణులను షాక్ కు గురిచేస్తున్నది. ఇతర పార్టీల లీడర్ల చేరికలతో ఇటీవల జోష్​లో ఉన్న కాంగ్రెస్​ పార్టీ ప్రస్తుత పరిణామాలతో కలవరపడుతున్నది. తన రాజీనామా అంశం కేసీఆర్​ కుట్రలో భాగమని రాజగోపాల్​రెడ్డి చెప్తున్నప్పటికీ..  సీనియర్​ లీడర్​ చేజారితే కేడర్​ దెబ్బతింటుందనే ఆందోళన కాంగ్రెస్​లో వ్యక్తమవుతున్నది.  ఎలాంటి పరిస్థితినైనా వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలని భావిస్తున్నది.

టీఆర్ఎస్​ ముందస్తు నజర్​

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టులో రాజీనామా చేస్తారని, అదే జరిగితే ఈ ఏడాది చివరిలోనే బైపోల్ జరిగే అవకాశం ఉండొచ్చని టీఆర్ఎస్ కొంతకాలంగా ప్రచారం చేస్తున్నది. తాజా ఊహాగానాలతో అయిదు రోజులుగా మునుగోడు నియోజకవర్గంపైనే సమీక్షలు నిర్వహిస్తున్నది. ఎనిమిదేండ్లుగా మునుగోడులో అభివృద్ధి పనులేవీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమేం పెండింగ్​ పనులున్నాయని ఫైళ్లు కదుపుతున్నది. 
దుబ్బాక అనుభవంతో హుజూరాబాద్​లో సర్వశక్తులు ఒడ్డి కూడా ఓడిపోవటంతో మునుగోడు బై ఎలక్షన్​ భయం రూలింగ్​ పార్టీని వెంటాడుతున్నది. జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలతోపాటు అక్కడ జరిగే ప్రతి ప్రోగ్రాం ఆయనకే అప్పగించింది. పార్టీ చేరికలను ప్రోత్సహించడం.. పెండింగ్ పనులను క్లియర్ చేయడం వంటి వాటిని స్పీడప్ ​ చేసింది.

మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పుల్​ను మండల కేంద్రంగా ప్రకటిస్తానని 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్​.. అక్కడ టీఆర్​ఎస్​ ఓడిపోవడంతో ఆ హామీని నెరవేర్చకుండా పెండింగ్​లో పెట్టారు. ఇప్పుడు దానికి ఓకే చెప్పారు. 
నిరుడు చండూరు కాంగ్రెస్ జెడ్పీటీసీ మెంబర్​ కర్నాటి వెంకటేశం, ఆ తర్వాత చండూరు మున్సిపల్ చైర్మన్​ను టీఆర్​ఎస్​ నేతలు పార్టీలో చేర్చుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గెలిచాక జరిగిన స్థానిక ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత  ప్రలోభాలకు తలొగ్గిన స్థానిక కాంగ్రెస్​ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు పార్టీని వీడారు.  

డైలమాలో కాంగ్రెస్​

కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తాజా ఎపిసోడ్​ కాంగ్రెస్​ను డైలమాలో పడేసింది. గతంలో పలుమార్లు రాజగోపాల్​రెడ్డి పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగిందని, ఇప్పుడు కూడా అంతేనని కొందరు కాంగ్రెస్​ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఢిల్లీలో అమిత్​షాతో భేటీ కావటంతో ఆయన పార్టీ మారే ప్రమాదం లేకపోలేదని కాంగ్రెస్​ అప్రమత్తమవుతున్నది. పార్టీ లీడర్లు రాజగోపాల్​రెడ్డితో మంతనాలు మొదలుపెట్టారు. సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క​ సోమవారం సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి నివాసానికి వెళ్లి  చర్చలు జరిపారు.

సిట్టింగ్​ సీటు కావటం, కాంగ్రెస్​ పార్టీకి పట్టున్న నియోజకవర్గం కావటంతో మునుగోడు ఎఫెక్ట్ ఎలా ఉంటుందోననే ఆందోళన పార్టీలో మొదలైంది. హుజూరాబాద్​లో తమకు గడ్డు పరిస్థితి ఎదురైందని, ఇప్పటికిప్పుడు మునుగోడుకు బై ఎలక్షన్​ వస్తే మళ్లీ అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్​ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. మునుగోడుతోపాటు ఉమ్మడి నల్గొండ  జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి సోదరులకు పట్టు ఉంది. దీంతో రాజగోపాల్​రెడ్డి వెళ్లిపోతే ఆయనతో పాటు కేడర్​కూడా చేజారుతుందనే భయం కాంగ్రెస్​ను వెంటాడుతున్నది. అయితే.. మునుగోడులో ఎలాంటి పరిస్థితి ఎదురైనా వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నది. 

హామీలు యాదికొస్తున్నయ్​

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని గట్టుప్పల్​ను మండలంగా ప్రకటించిన క్రెడిట్​.. తమ ఖాతాలో వేసుకునేందుకు ‘కేసీఆర్ కృతజ్ఞత సభ’ను టీఆర్​ఎస్​ తలపెట్టింది. మండలంలో విలీనం చేసిన ఎనిమిది  గ్రామాల ప్రజలను సమీకరించి మంగళవారం ఈ సభను పెద్ద ఎత్తున జరపాలని మంత్రి జగదీశ్​రెడ్డి ప్లాన్​ చేశారు.  ఈ సందర్భంగా పలువురి చేరికలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చండూరు, చౌటుప్పల్​కు  చెందిన మరికొందరు నేతలను పార్టీలోకి రప్పించేందుకు టీఆర్​ఎస్​ బేరసారాలు ముమ్మరం చేసింది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేసి చెక్కులు పంపిణీ చేస్తున్నది. నియోజకవర్గంలోని మునుగోడు, సంస్థాన్​ నారాయణపూర్​ మండలాల్లోని దళిత బంధు అర్హుల  జాబితాలు రెడీ చేస్తున్నది. శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్ల ముంపు బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని,  నాంపల్లి మీదుగా వచ్చే శేషిలేటివాగు పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అధికార పార్టీ నేతలు హామీలు కుమ్మరిస్తున్నారు.

బీజేపీ స్పెషల్ ఫోకస్
మునుగోడుపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అక్కడ బై ఎలక్షన్​ వస్తే  దుబ్బాక, హుజూరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల గెలుపును మళ్లీ చాటుకోవాలని కమల దళం పట్టుదలతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో పోటీ చేసిన  బీజేపీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి సుమారు 13 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆయన పార్టీ  రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే.. అక్కడ విజయం సాధించాలని బీజేపీ హైకమాండ్​ భావిస్తున్నది. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడింది. ఇప్పట్నుంచే మూడు ప్రధాన పార్టీల్లో మునుగోడు హీట్​మొదలైనప్పటికీ.. అసలు వేడి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా చేసి, ఉప ఎన్నిక ముంచుకు వస్తేనే అని జనం అనుకుంటున్నారు.