పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా: కోహ్లి

పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా: కోహ్లి

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తనను తాను పాజిటివ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. మళ్లీ క్రికెట్ ఎప్పుడు మొదలయినా.. సానుకూల దృక్పథంతో రెడీగా ఉండేలా ట్రై చేస్తున్నానని పేర్కొన్నాడు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెటింగ్ కార్యకలాపాలు షట్ డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిజికల్ ఫిట్ నెస్ తోపాటు మెంటల్ ఫిట్ నెస్ పైనా దృష్టి సారించినట్లు కోహ్లి తెలిపాడు.

ప్రతిదీ మన చేతిలో ఉండదు
‘అదృష్టవశాత్తూ నా జిమ్ ఎక్విప్ మెంట్ నా దగ్గరే ఉండటంతో ట్రెయిన్ చేసుకోగలను. అది నాకు పెద్ద సమస్య కాదు. గేమ్ గురించి చెప్పాలంటే.. మానసిక స్థాయిని మెరుగుపర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతా. కొంతకాలం వరకు నెట్ లో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేయబోను. ఎప్పుడైతే గేమ్ ఆరంభిస్తానో.. అప్పుడు నేను మంచి మైండ్ సెట్ తో ఉన్నానని, నన్ను నేను పాజిటివ్ గా, సంతోషంగా ఉంచుకోగలనని, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లనని, ఎక్కడి నుంచి ఆపామో మళ్లీ అక్కడి నుంచే ఆటను స్టార్ట్‌ చేయడానికి మంచి పొజిషన్ లో ఉన్నానని అర్థం. తొలినాళ్లలో ఇది అంత సులభంగా ఉండేది కాదు. కొంచెం కఠినంగా అనిపించేది. టైమ్ గడుస్తున్న కొద్దీ విషయాలను భిన్న దృక్కోణం నుంచి చూడటం అలవడుతుంది. ఏ విషయమూ మన చేతిలో ఉండదని అర్థమవుతుంది. ఒక పరిధి వరకు మనం నియంత్రించగలిగే మన మైండ్ సెట్ ను సాధ్యమైనంత పాజిటివ్ గా ఉంచుకోవాలి. అందుకే మంచి విషయాలతో నిండిపోయేలా నా మెదడును ట్రెయిన్ చేస్తుంటా. నాకు ప్రాక్టీస్ ఎప్పుడూ పెద్ద ప్రాబ్లమ్ కాదు. అందుకే నేను ట్రెయినింగ్ చేస్తున్నా. ఫిట్ ఉండటానికి యత్నిస్తున్నా’ అని విరాట్ వివరించాడు.

ఐపీఎల్ తో అందరికీ అనుబంధం
‘ప్లేయర్లు అన్ని టోర్నమెంట్ లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో ఒక టీమ్ తో మరో టీమ్ పోటీ పడటమే. ఐసీసీ టోర్నీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ టోర్నీల్లో ఇతర జట్ల ప్లేయర్లను కలవలేం. అదే ఐపీఎల్ లో ప్రతీ రెండో లేదా మూడో రోజు వేరే ప్లేయర్స్ ను కలవొచ్చు.. అదే ఐపీఎల్ గొప్పదనం. అక్కడ ఆడేటప్పుడు సెపరేట్ వాతావరణం ఉంటుంది. మాకు తెలిసిన విషయాలను కొత్త ఆటగాళ్లతో పంచుకోవచ్చు. చాన్నాళ్ల నుంచి తెలిసిన ప్లేయర్లు, విదేశీ ఆటగాళ్లనూ కలుసుకోవచ్చు. అందుకే ఐపీఎల్ ను అందరూ ఇష్టపడతారు. ఐపీఎల్ లో ప్లేయర్లు, ప్రేక్షకులు, ఫ్యాన్స్ కు మధ్య ఒక కనెక్షన్ ఉంటుందని’ కోహ్లి చెప్పాడు.