దాణా కుంభకోణం కేసు.. లాలూ బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీబీఐ

దాణా కుంభకోణం కేసు.. లాలూ బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీబీఐ

దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు బిగ్  షాక్ తగిలింది. ఆయనకు  మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని  సుప్రీంకోర్టులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సవాలు చేసింది. జార్ఖండ్ హైకోర్టు 2022 ఏప్రిల్ 22న యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఆగస్టు 25న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 

లాలూ ప్రసాద్ యాదవ్‌కు సీబీఐ కోర్టు గతేడాది ఫిబ్రవరి 15న శిక్ష విధించింది. ఫిబ్రవరి 21న దాణా కుంభకోణం కేసులో ఐదేళ్ల జైలుశిక్ష, రూ.60 లక్షల జరిమానా విధించారు. ప్రస్తుతం 72 ఏళ్ల యాదవ్ తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కోలుకుంటున్నారు. కిడ్నీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి 16 వ్యాధులతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం.

1990-97 మ‌ధ్య లాలూ ప్రసాద్ యాద‌వ్ బీహార్ సీఎంగా ఉన్న టైమ్ లో దాణా కొనుగోళ్లలో అక్రమాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.  అప్పట్లో బీహార్‌లో దాణా కోసం మొత్తం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. 1991 నుంచి 1994 మధ్య ట్రెజరీ నుంచి పశుదాణా కోసం అక్రమంగా రూ.89 లక్షలు విత్‌డ్రా చేశారు. ఈ కేసులోనే సుదీర్ఘంగా వాద‌న‌లు జ‌రిగాయి. దాణా సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ,లేని కంపెనీలను సృష్టించి వాటి పేరుతో డబ్బులు డ్రా చేశారని కోర్టు తేల్చింది.