మామిడి తోటలపై ఫాగ్ ఎఫెక్ట్.. అధిక తేమ శాతంతో నల్లబడుతూ రాలిపోతున్న పూత

మామిడి తోటలపై  ఫాగ్ ఎఫెక్ట్.. అధిక తేమ శాతంతో నల్లబడుతూ రాలిపోతున్న పూత
  •     మామిడి రైతులపై చలి తీవ్రత, పొగమంచు ప్రభావం
  •     దిగుబడి భారీగా తగ్గుతుందనే ఆందోళనలో రైతు సంఘాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వాతావరణ మార్పులు మామిడి రైతులను  దెబ్బతీస్తున్నాయి. ఇటీవలి చలి తీవ్రత, పొగమంచు (ఫాగ్) ప్రభావం వల్ల మామిడి తోటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పూత దశలోనే నల్లగా మారి రాలిపోవడం, అధిక తేమ శాతం కారణంగా పూత విరబూయకపోవడంతో రైతాంగం ఆందోళనకు గురవుతోంది. 

రాష్ట్ర వ్యాప్తంగా 2.89 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుండగా, ఈ సీజన్‌‌లో 10.50 లక్షల టన్నుల దిగుబడి ఆశించినా, ప్రస్తుత పరిస్థితులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులు మామిడి పూతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

పూతపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం 

సాధారణంగా  డిసెంబర్ నెలాఖరులో మామిడి చెట్లు పూతతో కళకళలాడాలి. కానీ, ఈసారి చలి తీవ్రత ఎక్కువ కావడం, అత్యల్ప ఉష్ణోగ్రతల(కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీలకు పడిపోవడం) వల్ల పూత నల్లగా మారి రాలుతోంది. పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో అధిక తేమ శాతం పెరిగి, పూత ఆలస్యమవుతోంది. ఫలితంగా, చెట్టుపై ఉన్న పూత గణనీయంగా తగ్గిపోయింది. "మా తోటల్లో పూత ఆశించిన మేర రాలేదు. వచ్చినది కూడా రాలిపోతోంది. ఇలా అయితే కాపు రావడం కష్టమే!" అంటూ రైతులు వాపోతున్నారు. 

ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మామిడి సాగు విస్తృతంగా ఉంది. మహబూబాబాద్ జిల్లాలోని కురవి, మరిపెడ, తొర్రూరు, నర్సింహులపేట మండలాలు.. జనగామ జిల్లాలో స్టేషన్ ఘన్‌‌పూర్, పాలకుర్తి, జనగామ.. ఖమ్మం పరిధిలో పాలేరు, మదిర, సత్తుపల్లి, కొత్తగూడెం.. నల్గొండలో కట్టంగూరు, నకిరేకల్, నాంపల్లి, త్రిపురారం, సూర్యాపేట, భువనగిరి, కోదాడ మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో50 శాతం వరకు మాత్రమే పూత వచ్చింది. సాధారణంగా డిసెంబరు నెల ముగిసేలోపే 80 శాతం పూత రావాలి. కానీ, పొగ మంచు వల్ల తేనె మంచు, పురుగుల బెడద పెరిగి పూతకు మరింత నష్టం వాటిల్లుతోంది.

హెచ్చరిస్తున్న హార్టీకల్చర్ ఎక్స్‌‌పర్ట్స్ ​...

 "ఈసారి వాతావరణ మార్పులు ప్రతికూలంగా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగితే మామిడి పూతపిందెలు రాలిపోయే ప్రమాదం ఉంది. గత రెండేండ్లలోనూ ఇలాంటి పరిస్థితి వల్లే 60 శాతం పూత రాలిపోయింది. ఇప్పుడు కూడా పూత ఆశించిన మేర రాకపోవడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది" అని హార్టీకల్చర్ ఎక్స్‌‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.రైతులు లక్షల్లో పెట్టుబడి పెట్టి తోటలు సాగు చేస్తున్నా, ప్రకృతి సహకరించకపోవడంతో నష్టాలు తప్పడం లేదు. వచ్చే కాతలు తగ్గిపోతాయనే భయంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

ఆందోళనలో రైతాంగం..

రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తోటలను సాగుచేస్తే, ప్రతికూల వాతావరణంతో  తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితులు ఇకపైనా కొనసాగితే ఈసారి మామిడి దిగుబడి పెరగడం కష్టమేనని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులకు తగ్గట్టు మామిడి సాగు టెక్నిక్‌‌లు, పురుగుల నివారణ చర్యలపై మరిన్ని మార్గదర్శకాలు అవసరమని రైతు సంఘాలు అంటున్నాయి. మామిడి సీజన్ ప్రభావితం కాకుండా హార్టీకల్చర్ విభాగం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.