ఆకలిని తట్టుకోలేక మట్టి తింటున్న ప్రజలు

ఆకలిని తట్టుకోలేక మట్టి తింటున్న ప్రజలు

యాంటాననరివో: ఆకలితో మడగాస్కర్ దేశం అల్లల్లాడిపోతోంది. సౌత్ మడగాస్కర్‌‌లో చాలా చోట్ల తినడానికి తిండి లేక ప్రజలు మట్టిని చింతపండుతో కలిపి తింటున్నారనంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రాండ్ సుడ్‌‌గా పిలుచుకునే సౌత్ మడగాస్కర్‌‌లో దాదాపు 7.5 లక్షలకు పైగా ప్రజలు తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు. గత 2-3 ఏళ్లలో ఈ పరిస్థితి మరింత విషమించింది.

ఈ ప్రాంతంలో రాజకీయంగా స్థిరత్వం కొరవడటంతో ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర పేదరికంలోకి కూరుకుపోయారు. మడగాస్కర్ జనాభాలో సుమారు 76 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. వరదలు, తుఫానులు, కరువు లాంటి ప్రకృతి విపత్తులు బీభత్సంగా విరుచుకుపడటం కూడా ఈ ప్రాంతం ఇలా తయారవ్వడానికి కారణాలుగా మారాయి. గత 35 ఏళ్లలో ఈ దేశంలో 50 మార్లు ప్రకృతి విపత్తులు తలెత్తడం గమనార్హం.

మడగాస్కర్ ప్రజలు ఎక్కువగా రైస్‌‌ను తింటారు. అయితే దేశ జనాభాకు సరిపోయే మొత్తంలో ఇక్కడ రైస్‌‌ ఉత్పత్తి అవ్వడం లేదు. వ్యవసాయ రంగ ఉత్పత్తులు లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణం. సహజ వనరులు తక్కువగా ఉండటం, మార్కెట్ పెద్దగా లేకపోవడంతోపాటు లింగ వివక్షత వంటి పలు సమస్యల వల్ల వ్యవసాయ దిగుబడి పడిపోయింది. ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.