ఆరోగ్యానికి పాలకూర

ఆరోగ్యానికి పాలకూర

పాల కూరను చాలామంది ఇష్టపడుతారు. పప్పు, కూర ఎలా చేసినా దీని టేస్టే వేరు. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ తో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకలు దృఢంగా మారతాయి. మరెందుకు ఆలస్యం.. కాస్త డిఫరెంట్ పాలక్ రె సిపీలు ట్రై చేయండి.

పాలక్ చికెన్ కర్రీ..

కావాల్సినవి..చికెన్ : కేజీ, పాలకూర: నాలుగు కట్టలు, టొమాటోలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, పసుపు: అర టీన్, కారం: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, గరం మసాలా: పావు టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్​: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: తగినంత

తయారీ

పాలకూర శుభ్రంగా కడిగి ఐదు నిమిషాలు ఉడికించి నీళ్లు వడకట్టాలి. తర్వాత తరిగిన పాలకూరతో పాటు టొమాటో ముక్కలు కలిపి మిక్సీ పట్టాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేగించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసి రెండు నిమిషాల తర్వాత చికెన్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ముక్కలు వేగాక పాలకూర ముద్ద వేసి, గరం మసాలా, అర కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి . నూనె పైకి తేలే వరకు ఉడికిస్తే పాలక్ చికెన్ రెడీ. ఈ కూర అన్నం, రొట్టెల్లోకి బాగుంటుంది.

పాలకూర పచ్చడి..

కావాల్సినవి పాలకూర: రెండు వందల గ్రాములు, పచ్చి కొబ్బరి ముక్కలు: పావు కప్పు, మినపప్పు: రెండు టీ స్పూన్లు, శెనగపప్పు: ఒక టీ స్పూన్ , జీలకర్ర: ఒక టీ స్పూన్, పసుపు: పావు టీ స్పూన్ , ఇంగువ: కొంచెం,  తపండు: ఒక టేబుల్ స్పూన్ , బెల్లం : చిన్న ముక్క, ఉప్పు: తగినంత, గరం మసాల : పావు టీస్పూన్‌పోపు కోసం ఆవాలు: అర టీ స్పూన్ , కరివేపాకు: ఒక రెమ్మ, ఎండుమిర్చి: రెండు, నూనె: రెండు టీ స్పూన్లు, వెల్లుల్లి: రెండు రెబ్బలు.

తయారీ

పాలకూర శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో నిమిషం ఉడికించి నీళ్లు వడకట్టి పక్కన పెట్టాలి. స్టవ్ పైన చిన్న పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర, పసుపు, మినప్పప్పు, శెనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేగించాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి  ముక్కలు వేయాలి. తర్వాత ఉడికించిన పాలకూర, వేగించిన మసాలా, బెల్లం చింతపండు కలిపి మెత్తగా రుబ్బాలి. తాలింపు కోసం ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఐదు నిమిషాలు వేగించి.. పాలకూర పచ్చడిలో వేసి కలపాలి.

పాలక్ సూప్..

కావాల్సినవి ..పాలకూర తరుగు: రెండు కప్పులు, ఉల్లిపాయ ముక్కలు: పావు కప్పు, వెల్లుల్లి తరుగు: ఒక టీ స్పూన్, శెనగపిండి:ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి: పావు టీ స్పూన్ , బిర్యానీ ఆకు: ఒకటి, వెన్న: ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు: తగినంత, మిరియాల పొడికొద్దిగా, క్రీమ్‌: ఒక టీ స్పూన్

తయారీ

పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు వేగించాలి. అందులోనే వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేగించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేగించి, పాలకూర తరుగు వేయాలి. ఇందులోనే ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మెత్తబడిన తర్వాత శెనగపిండి కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత స్టవ్ మంట తగ్గించి నాలుగు నిమిషాలపాటు ఉడికించి జీలకర్ర పొడి వేయాలి. పాలకూర మిశ్రమం చల్లారాక అందులోనే బిర్యానీ ఆకు తీసి మొత్తగా మిక్సీ పట్టాలి . సూప్‌ మరీ చిక్కగా ఉంటే పావు కప్పు నీళ్లు కలుపుకోవచ్చు. ఈ సూప్‌ను మరోసారి పాన్ లో వేసి మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి. చివరిగా క్రీమ్‌ వేసుకుంటే వేడివేడి పాలక్ సూప్​ రెడీ.