ఎనిమిది మంది విద్యార్థులకు ఫుడ్​పాయిజన్​

ఎనిమిది మంది విద్యార్థులకు ఫుడ్​పాయిజన్​

ములుగు, వెలుగు : సోషల్​ వెల్ఫేర్ గురుకులంలో 6, 8వ తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులకు ఫుడ్​పాయిజన్​ అయ్యింది.  వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న స్టూడెంట్లకు టీచర్లు దవాఖానకు వెళ్లడంటూ ఉచిత సలహా ఇచ్చి పంపించారు. దీంతో విద్యార్థులే అటెండెంట్​ లేకుండా ములుగు ఏరియా దవాఖానకు వెళ్లాల్సి వచ్చింది. వసతులు లేకపోవడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం సోషల్ వెల్ఫేర్​గురుకులాన్ని ములుగు మండలం మల్లంపల్లిలోని మామాడితోటలోని బిల్డింగ్​లో నిర్వహిస్తున్నారు.

ఇక్కడ 5 వతరగతి నుంచి ఇంటర్​వరకు 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులు కడుపునొప్పి తో మెలికలు తిరిగిపోయారు. దీంతో కొన్ని ట్యాబ్లెట్స్​ ఇచ్చారు. సోమవారం ఉదయం ఆలు రైస్​ తిన్న 6,8 తరగతులు చదువుతున్న ఎనిమిది మందికి వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో వారిని దవాఖానకు వెళ్లాలని టీచర్లు చెప్పి పంపించారు. అటెండెంట్, వార్డెన్, టీచర్లు లేకుండానే స్టూడెంట్స్​ ములుగుకు వెళ్లారు. బస్టాండ్​లో తల్లిదండ్రులకు ఫోన్​ చేయగా, వారు వచ్చి పిల్లలను దవాఖానలో జాయిన్ ​చేశారు. తర్వాత ప్రిన్సిపాల్​నర్సయ్యకు ఫోన్​చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్​సత్యనారాయణ స్వామి దవాఖనకు వచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.