ఇంత కక్కుర్తి ఏంట్రా : షాదాబ్, అరేబియన్ రెస్టారెంట్లలో కుళ్లిన మాంసం, కంపుకొట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్

ఇంత కక్కుర్తి ఏంట్రా : షాదాబ్, అరేబియన్ రెస్టారెంట్లలో కుళ్లిన మాంసం, కంపుకొట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్

హైదరాబాద్ లో టాప్ రెస్టారెంట్లు.. మంచి ఘుమఘుమలాగే బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అంటే.. ఠక్కున చెప్పే కొన్ని రెస్టారెంట్లలో షాబాద్ రెస్టారెంట్, అరేబియన్ రెస్టారెంట్లు.. ఈ రెండు హోటల్స్ బాగోతం ఇప్పుడు బట్టబయలు అయ్యింది. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. విషయం తెలిసి బిర్యానీ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. 

ఏంటీ అరేబియన్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన మాంసం ఉందా..  షాబాద్ రెస్టారెంట్ లో చెడిపోయిన, కంపు కొడుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరికిందా.. పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా అని షాక్ అవుతున్నారు.. వాళ్లకేం పోయేరోగం.. సేల్స్ బాగానే ఉన్నాయి కదా అంటూ విస్తుపోతున్నారు హైదరాబాద్ ఫుడ్ ప్రియులు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

 మే 31వ తేదీ శుక్రవారం హైదరాబాద్ పాతబస్తీలోని వివిధ రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సోదాలు చేపట్టారు.అరేబియన్ రెస్టారెంట్ లో సోదాలు చేసిన అధికారులు.. ఫ్రిజ్‌ లో కుళ్లిన మాంసం,  పాడైపోయిన వండిన వంటకాలను గుర్తించారు. ఇక, షాదాబ్ హోటల్‌ లో పాడైపోయిన అల్లం వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్‌ గుర్తించారు. చార్మినార్ పక్కనున్న నిమ్రా కేఫ్ కిచెన్ హైజీనిక్ గా లేకపోవడం.. కిచెన్ లో పని చేసేవారు క్లీన్ గా లేకపోవడాన్ని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 

అలాగే.. కాటేదాన్‌ లోని మూడు ఆయిల్ కంపెనీల్లో సోదాలు చేశారు. భాగ్యనగర్ ఆయిల్, కేడియా ఆగ్రో, అంబికా ఆయిల్‌ కంపెనీల్లో సోదాలు జరిపిన అధికారులు.. వంట నూనె తయారీలో కంపెనీలు నిబంధనలు పాటించలేదని.. నిల్వ ఉంచిన రా మెటీరియల్‌ లో పురుగులుఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న  రెస్టారెంట్లు, హోటల్స్, ఆయిల్ కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. 

గత, కొన్ని రోజులుగా  నగరంలోతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రముఖ రెస్టారెంట్స్, హోటల్స్ పై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందించడం లేందంటూ రెస్టారెంట్స్, హోటల్స్ పై వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఖమ్మ జిల్లాలో ఓ రెస్టారెంట్ లో ఫ్రిజ్ లో ఉన్న కుళ్లిన చికెన్ ముక్కలను గుర్తించి.. డ్రైనేజీలో పడేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.