ఇథనాల్ ప్లాంట్లతో ఆహార కొరత

ఇథనాల్ ప్లాంట్లతో ఆహార కొరత
  •     పెట్రోల్, డీజిల్​కు ఇథనాల్​ప్రత్యామ్నాయం కాదు
  •     సెమినార్​లో శాస్ర్తవేత్తలు, మేధావుల ఆందోళన

హైదరాబాద్, వెలుగు : దేశంలో పెట్రోల్, డీజిల్​వంటి ఇంధన కొరతను నివారించడానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఇథనాల్​ఉత్పత్తికి అనుమతులివ్వడం సరికాదని పలువురు మేధావులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇథనాల్ ను పెట్రోల్​కు ప్రత్యామ్నాయంగా చేస్తామని, 56 రూపాయలకే లీటర్​ ఇస్తామని చెప్పడం ప్రజల్ని మభ్యపెట్టడమేనని వారు అభిప్రాయపడ్డారు. నారాయణపేట జిల్లా చిత్తనూరులో ఇథనాల్​పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు, స్థానిక రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో

‘‘ఆహార పంటలతో ఇథనాల్​ ఇంధనం–సాధ్యత, సుస్థిరత, శాస్ర్తీయత ’’ అనే అంశంపై శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్​నిర్వహించారు. కేఏఎన్​పీఎస్​రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెమినార్​కు ప్రొఫెసర్​హరగోపాల్​, డా.శర్మ, డా. కె.బాబూరావు, డా. అహ్మద్ ఖాన్​, ప్రొఫెసర్​విజయ్, కన్నెగంటి రవి, ప్రొఫెసర్​శ్రీనివాసులు, బండారి లక్ష్మయ్య, కేజే రామారావు  పాల్గొన్నారు. 

ఇంధన ఖర్చు తగ్గించాలి : డా.ఈఏఎస్​శర్మ

దేశంలోని సంపన్న వర్గాలు పెట్రోల్, డీజిల్​ వంటి ఇంధనాన్ని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారని, కార్లు, ఇతర వాహనాలను విరివిగా వాడడం వల్ల ఇంధనం ఎక్కువ ఖర్చవుతోందని  భారత మాజీ ప్రభుత్వ కార్యదర్శి డా. ఈఏఎస్​శర్మ పేర్కొన్నారు. పబ్లిక్​ట్రాన్స్​పోర్ట్​ను పటిష్టపర్చడంతోపాటు, అన్ని వర్గాలు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటే ఇంధన వ్యయం చాలా వరకు తగ్గుతుందన్నారు. ఒక లీటర్​ఇథనాల్​ఉత్పత్తికి 2,360 లీటర్ల నీరు అవసరం అవుతుందని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాలు లేకపోతే ఇలాంటి అనర్థాలే వస్తాయన్నారు.

దేశంలో అభివృద్ధి నమూనా ప్రజల సంక్షేమానికి అనుగుణంగా ఉండాలని ప్రొఫెసర్​హరగోపాల్​అన్నారు. రాష్ట్రంలో ఇథనాల్​ పరిశ్రమలు పెట్టడం అంటే రైతుల ప్రయోజనాలపై దెబ్బకొట్టడమేనని అన్నారు. పెట్రోల్, డీజిల్​కు ఇథనాల్​ ప్రత్యామ్నాయం కాదని డా. బాబూరావు అన్నారు. చిత్తనూరు ఇథనాల్ ప్లాంట్​విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ఇథనాల్​ను 46 రూపాయలకే ఇవ్వడం సాధ్యం కాదని ప్రొ.విజయ్​ అభిప్రాయపడ్డారు. ఇథనాల్​పరిశ్రమల ఏర్పాటుకు జరుగుతున్న పోరాటానికి ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కేజే రామారావు డిమాండ్​ చేశారు.