ఆ ఇద్దరి మొహాల్లో ఆనందం చూశారుగా..! వాళ్లిద్దరిదీ విడదీయలేని బంధం. అలాగని వాళ్లదేం రక్త సంబంధం కాదు. ఒకే ఒక్క బంధం, ఒకే ఒక్క ఆనందం వాళ్లది. ఇద్దరిదీ ఒకే పరిస్థితి. ఆమెకి పుట్టుకతోనే ఎడమ చెయ్యి లేదు. మోచెయ్యి వరకు మాత్రమే పెరిగింది. ఆ చిన్నోడిది అదే పరిస్థితి. ఇప్పుడీ ఫొటో బాగా వైరల్ అయింది. కార్సన్ పికెట్.. ఆస్ట్రేలియా డబ్ల్యూ లీగ్‌లో బ్రిస్బేన్ రోర్ టీంలో ఫుట్‌బాల్ ప్లేయర్. ఓర్లాండో ప్రైడ్కూ ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. లీగ్‌లోని ఓ మ్యాచ్‌కు ఫ్లోరిడాకు చెందిన 18 నెలల జోసెఫ్ టిడ్ అనే చిన్నారిని తీసుకొచ్చారు అతడి తల్లిదండ్రులు. మ్యాచ్ అయిపోగానే ఇదిగో ఇద్దరూ ఇలా చెయ్యి చెయ్యి కలిపి సంబర పడ్డారు. ఏప్రిల్‌లో జరిగిందీ ఘటన. ఈ మధ్యే ఆ ఫొటోను టిడ్ తల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత దానిని పికెట్ కోచ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి వేలాది మంది ఆ ఫొటోకు లైక్‌లు కొట్టారు. అందమైన క్షణాలంటూ మెచ్చుకున్నారు. పికెట్ కూడా టిడ్ను చూసి తెగ ఆనందపడుతోంది. ‘నువ్వే నా కొత్త హీరో’ అంటోంది.
