
జమ్మికుంట: తమ్మీ అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటే సీఎం కుర్చీకే ఎసరు పెడతావా అంటూ ఈటల రాజేందర్‌పై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. ఎన్నో పథకాలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న సర్కార్‌ను విమర్శించడానికి ఈటలకు నోరెలా వచ్చిందని మండిపడ్డారు. కేసీఆర్ అంటే ఓ వ్యక్తి కాదు ఒక శక్తి అన్నారు. కరీంనగర్ జిల్లా, జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
‘నాది సామాన్య వ్యవసాయ కుటుంబం. దేవుడి మీద భారం పెట్టి వ్యవసాయం చేస్తాం. పెట్టుబడి కోసం సావుకారుల దగ్గరికి వెళ్లి మిత్తీలకు డబ్బులు తీసుకునే పరిస్థితులు ఉండేవి. తెలంగాణ రాక ముందు 20 ఎకరాల్లో పంట సాగు చేస్తే, రాన్రానూ నష్టాల పాలై ఆఖరికి ఐదు ఎకరాలు మిగిలేవి. చేసిన అప్పులు తీర్చకపోతే బ్యాంకు అధికారులు వచ్చి పుస్తెలు, తలుపులు ఎత్తుకెళ్లేవారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక రైతు బంధు పథకం వల్ల సావుకారి దగ్గరికి వెళ్లకుండా అయింది. ఉచిత విద్యుత్, సాగు నీరు, రైతు బంధు డబ్బులతో ఐదు ఎకరాలను ఈ రోజు 20 ఎకరాలు చేసుకుంటున్నారు. వీటిని పక్కనబెడితే, టీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే బాద్యత మన అందరిది. హుజూరాబాద్ నియోజక వర్గంలో ఇప్పటికంటే వంద రెట్లు అభివృద్ది చేస్తాం. కాళేశ్వరం, పచ్చటి పొలాలు చూసైనా కేసీఆర్‌ను కడుపు నిండా దివించాలి. ఎవ్వరూ వచ్చి ఆపినా పథకాలు ఆగవు’ అని కమలాకర్ పేర్కొన్నారు. ఈటల ఏ పార్టీలో చేరినా తమకు అవసరం లేదని.. ఈ ఎన్నికల వల్ల రాష్ట్రం, దేశంలో ఏమీ మారదన్నారు. కానీ హుజురాబాద్ నియోజక వర్గంలో అభివృద్ధి జరగాలో వద్దనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.