పనులు దొరక్క ఖాళీగా ఉంటున్న యువత

పనులు దొరక్క ఖాళీగా ఉంటున్న యువత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అర్బన్ ఏరియాల్లో ప్రతి వంద మంది యువతలో 24 మంది పనులు దొరక్క ఖాళీగా ఉన్నారు. 30 ఏండ్లు వచ్చినా ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో పని చేయగలిగే మొత్తం జనాభాలో 10.6 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

గుజరాత్ లో అతి తక్కువ... 

ఎన్ఎస్ఓ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 15 ఏండ్ల నుంచి 29 ఏండ్ల లోపు ఉన్న యువకుల్లో 24.3% మంది, యువతుల్లో 24.4% మంది ఎలాంటి పని లేక ఖాళీగా ఉంటున్నారు. 15 ఏండ్లు, ఆపై ఏజ్ గ్రూప్ ను మొత్తంగా చూస్తే నిరుద్యోగ రేటు మగవారిలో 10.2%, ఆడవారిలో 11.8 శాతంగా ఉంది. దేశ సగటు నిరుద్యోగ రేటు (9.3%)తో పోలిస్తే రాష్ట్ర సగటు నిరుద్యోగ రేటు (10.6%) ఎక్కువగా ఉంది. ఈ విషయంలో మన కంటే 12 రాష్ట్రాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. దేశంలోనే అతి తక్కువగా గుజరాత్ లో 3.8% నిరుద్యోగ రేటు నమోదు కాగా... ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో 4.8%, కర్నాటక 6.7, ఆంధ్రప్రదేశ్ 7.2, పంజాబ్ 7.6, హిమాచల్ ప్రదేశ్ 7.8, బీహార్ 8, ఢిల్లీ 8.1, తమిళనాడు 9.0, అస్సాం 9.2, మధ్యప్రదేశ్ 9.8, హర్యానాలో 10.2% నమోదైంది.