బడ్జెట్కు వేళాయె.. నిర్మలమ్మ బడ్జెట్పై మధ్యతరగతి కోటి ఆశలు

బడ్జెట్కు వేళాయె.. నిర్మలమ్మ బడ్జెట్పై మధ్యతరగతి కోటి ఆశలు
  • వరుసగా 9వ సారి.. ఇవాళ (ఫిబ్రవరి 01) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
  • ప్రణబ్ ముఖర్జీ రికార్డును అధిగమించనున్న ఆర్థిక మంత్రి 
  • దేశ చరిత్రలోనే తొలిసారి ఆదివారం రోజున బడ్జెట్ 
  • ఉదయం11 గంటలకు పార్లమెంట్​లో బడ్జెట్ స్పీచ్ ప్రారంభం 
  • దేశ ఆర్థిక భవిష్యత్తుపై డీటెయిల్డ్ విజన్ ఆవిష్కరించే చాన్స్

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం పార్లమెంట్​లో  కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రణబ్ ముఖర్జీ రికార్డును ఆమె అధిగమించనున్నారు. ఇలా వరుసగా 9 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా కూడా ఆమె రికార్డు క్రియేట్ చేయనున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం (ఫిబ్రవరి 01) రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా కొత్త ఒరవడికి కూడా నిర్మల శ్రీకారం చుట్టనున్నారు. 

ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే బడ్జెట్ ప్రసంగం దాదాపు గంట, గంటన్నర సేపు కొనసాగనుంది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చాక 2019లో నిర్మల ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల తర్వాత ఆమె ఆర్థిక మంత్రిగా తిరిగి బాధ్యతలు తీసుకున్నారు. 2019లో మొదటిసారి కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టిన ఆమె.. ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్​తో సహా ఇప్పటివరకూ వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రసంగం చదివారు. ఆదివారం 9వ సారి బడ్జెట్ స్పీచ్ ఇవ్వనున్నారు.

కేంద్ర బడ్జెట్ ప్రసంగాల్లో పార్ట్ ఏలో అత్యధిక అంశా లను పొందుపర్చడం.. పార్ట్ బీలో కేవలం ట్యాక్స్, పాలసీ ప్రకటనల వంటివి మాత్రమే చదవడం గత 75 ఏండ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని కూడా నిర్మల పక్కన పెట్టనున్నారు. ఈసారి పార్ట్ బీలో భారత ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో సహా డీటెయిల్డ్ విజన్ ను ఆమె ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. 

దశాబ్దాల నుంచి లెదర్ బ్రీఫ్ కేస్ లో బడ్జెట్ పత్రాలను పార్లమెంట్ కు తీసుకురావడం ఆనవాయితీగా ఉండగా, జాతీయ చిహ్నంతో కూడిన రెడ్ క్లాత్ లో చుట్టి లెడ్జర్ ను సభకు తీసుకురావడం అనే కొత్త సంప్రదాయానికి కూడా నిర్మల హయాంలోనే శ్రీకారం చుట్టారు. అలాగే గత నాలుగేండ్ల మాదిరిగానే ఈసారి కూడా పేపర్ లెస్ విధానంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.  

తొలిసారి ఆదివారం రోజున.. 

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ ను నిర్మల ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఫిబ్రవరి నెల ఆఖరి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. 1999లో ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 28వ తేదీన ఆదివారం వచ్చింది. అయితే, వర్కింగ్ డే రోజునే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా ఉండటంతో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 27వ తేదీన శనివారం రోజే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017లో కేంద్ర బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చింది. అలాగే వారంతో సంబంధం లేకుండా కచ్చితంగా 1వ తేదీనే బడ్జెట్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో తొలిసారిగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది.  

మొరార్జీ దేశాయ్ తర్వాత రెండో స్థానం.. 

కేంద్ర బడ్జెట్ ను అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన 1959లో మొదటిసారి, 1969లో చివరిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయ్ తర్వాత అత్యధికంగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా పి. చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు. ఆయన1996లో తొలిసారి, 2014లో ఆఖరిసారి బడ్జెట్ స్పీచ్ చదివారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులుగా మూడో స్థానంలో ఉన్నారు. 

ప్రణబ్ ముఖర్జీ 1982లో తొలిసారి, 2012లో చివరిసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. తాజాగా 9వ సారి బడ్జెట్ స్పీచ్ చదవడం ద్వారా ప్రణబ్ రికార్డును అధిగమించి.. పి. చిదంబరం రికార్డును ఆమె సమం చేయనున్నారు. అయితే, వరుసగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మల టాప్ లో ఉన్నారు. 2025, ఫిబ్రవరి 1వ తేదీననే ఆమె అత్యధిక సార్లు (8 సార్లు) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డ్ క్రియేట్ చేశారు. అంతకుముందు 2024, జులై 23ననే మొరార్జీ దేశాయ్ (వరుసగా 6 సార్లు) రికార్డును ఆమె అధిగమించారు.