దేశంలో అల్లర్లకు విదేశీ కుట్ర.. చూస్తూ ఊరుకునేది లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

దేశంలో అల్లర్లకు విదేశీ కుట్ర.. చూస్తూ ఊరుకునేది లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

షాద్ నగర్, వెలుగు: దేశంలో అల్లర్ల కోసం విదేశీ కుట్రలు కొనసాగుతున్నాయని, వీటిని చూస్తూ ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఏబీ కాంప్లెక్స్ లో జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ గౌడ్  ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ కుట్ర దాగి ఉందన్నారు. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీలో కాంగ్రెస్  లీడర్లు కూడా ఉన్నారన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఉన్న టైంలో అనేక పేపర్  లీకేజీలు జరిగాయని, అప్పుడు ఎవరైనా రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.

జంతర్ మంతర్ నిరసనకు హైదరాబాద్ నుంచి బిర్యానీ పోతే ఇబ్బందేం లేదని, కానీ, విదేశాల నుంచి కూడా భోజనాలు వస్తున్నాయని, అందులో ఏమొస్తుందో అందరికీ తెలుసన్నారు. పార్లమెంట్లో మాట్లాడాల్సిన రాహుల్ గాంధీ.. మోదీ ఇంటి ముందు చేతకాక ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. కాక్రోచ్  పార్టీలో సినిమా వాళ్లు, ఆటగాళ్లు, నక్సలైట్లు కలవడం చూస్తే దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికే అని అర్థం చేసుకోవాలన్నారు.

హైదరాబాద్లో జరిగిన కాక్రోచ్  పార్టీ సమావేశానికి కూడా నక్సలైట్లు హాజరయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్ ఇద్దరూ ఒకటేనన్నారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో గ్రూప్–1, ఇంటర్  పరీక్ష పత్రాలు లీక్  అయి 27 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై కేటీఆర్  ఎందుకు సంజాయిషీ ఇవ్వలేదని, రాజీనామాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

అనంతరం ఫీజు రీయింబర్స్​మెంట్ నిధుల విడుదల కోసం.. ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ పోస్టర్ ను రిలీజ్​ చేశారు. జిల్లా ఇన్​చార్జి రఘునాథ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

గోరక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
ఎల్బీనగర్  బైరమల్ గూడలోని శ్రీహనుమాన్ గోశాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సందర్శించారు. రాష్ట్రంలో గోవధ నిరోధక చట్టం అమలులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు.