అటవీ శాఖలో ఇంటి దొంగలు

అటవీ శాఖలో ఇంటి దొంగలు

 

  •     ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కలప స్మగ్లింగ్​ వెనుక ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు
  •     గత రెండేళ్లలో ఏకంగా 78 మంది ఆఫీసర్ల సస్పెన్షన్​
  •     115 మంది ఆఫీసర్లు, స్టాఫ్‌‌పై క్రమశిక్షణ చర్యలు

ఆదిలాబాద్,​ వెలుగు: హరితహారం కింద అడవులు పెంచాలని ప్రభుత్వం చెప్తుంటే.. అడవులను కాపాడాల్సిన ఫారెస్ట్‌‌ ఆఫీసర్లలో కొందరు ఇంటి దొంగలుగా మారుతున్నారు. అటు అడవుల్లో మొక్కలు నాటుతూనే ఇటు చెట్లు నరికే స్మగ్లర్లకు సహకరిస్తున్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గత రెండేళ్లలో కలప స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే కారణంతో 193 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో 78 మంది ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేయగా 115 మంది ఆఫీసర్లు, స్టాఫ్‌‌పై డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. ఆదిలాబాద్ ఫారెస్ట్ డిపార్ట్‌‌మెంట్ ఇటీవల జిల్లా పరిషత్‌‌కు సమర్పించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌‌లోని వివరాలు ఆ శాఖలో కలకలం రేపుతున్నాయి. 

తగ్గుతున్న అటవీ విస్తీర్ణం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1980లో 22.25 లక్షల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉండేవి. అయితే ప్రభుత్వాలు, ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల స్మగ్లర్లు పెరిగి పెద్ద సంఖ్యలో టేకు చెట్లను నరికేస్తుండటంతో 2014 నాటికి అటవీ విస్తీర్ణం 17.87 లక్షల ఎకరాలకు పడిపోయింది. అంటే అడవి లోపల జరిగే డీ ఫారెస్టేషన్​ కాకుండా ఫారెస్ట్ ఏరియానే ఏకంగా 4.38 లక్షల ఎకరాలకు తగ్గింది. 

2014లో రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం అడవుల సంరక్షణపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33శాతానికి పెంచడమే లక్ష్యంగా హరితహారం కింద అడవుల్లో కూడా ఏటా మొక్కలు నాటిస్తోంది. గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములనూ ధ్వంసం చేస్తూ పెద్దసంఖ్యలో మొక్కలు నాటుతుండటంతో ఫారెస్ట్ ఆఫీసర్లకు, స్థానికులకు మధ్య నిత్యం అగ్గి రగులుతోంది. ఇదంతా నాణానికి ఒకవైపు కాగా, మరోవైపు అడవులను కాపాడాల్సిన ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బందే స్మగ్లర్లకు సహకరిస్తూ పెద్దసంఖ్యలో దొరుకుతుండటం, అది కూడా ప్రస్తుత అటవీ మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి, గతంలో ఇదే శాఖను చూసిన జోగురామన్న సొంత జిల్లాలో కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

కవ్వాల్‌‌‌‌ను టైగర్ జోన్ చేసినా స్మగ్లింగ్ ఆగలే 

ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలో అతిపెద్ద కవ్వాల్ ఫారెస్ట్‌‌‌‌ను 2012లో 42వ టైగర్ జోన్‌‌‌‌గా కేంద్రం ప్రకటించింది. దీంతో ఫారెస్ట్​ ఆఫీసర్లు 892.23 చదరపు కిలోమీటర్లను కోర్ ఏరియాగా.. 1,119.68 చదరపు కిలోమీటర్లను బఫర్ ఏరియాగా గుర్తించి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. టైగర్ జోన్ కావడంతో ఫారెస్ట్​ డెవలప్‌‌‌‌మెంట్, పులుల రక్షణ కోసం కేంద్రం ఏటా రూ.4 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తోంది. 10 ఏండ్లుగా సుమారు రూ. 40 కోట్ల దాకా వచ్చిన సొమ్మును కూడా ఖర్చు పెడ్తున్న ఫారెస్ట్ డిపార్ట్‌‌‌‌మెంట్.. అటు కవ్వాల్‌‌‌‌తో పాటు ఇటు జిల్లాలో చెట్ల నరికివేతను, కలప స్మగ్లింగ్‌‌‌‌ను అరికట్టలేకపోతోందని విమర్శలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టేకు చెట్లు విస్తరించి ఉండటంతో దశాబ్దాలుగా కొందరు స్మగ్లర్లు ఈ అడవులను టార్గెట్​చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఒకరిద్దరు బడా స్మగ్లర్లయితే ఈ రెండు జిల్లాల్లోని వేలాది ఎకరాలను ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. కొంతకాలం కింద పట్టుబడిన బడా కలప స్మగ్లర్ పెద్ద శ్రీను అలియాస్ పోతారం శ్రీనివాస్‌‌‌‌కు అటు పొలిటికల్ లీడర్లతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్ల అండదండలున్నాయనే విషయం బయటపడింది. ప్రభుత్వాలు మారినా, పాలసీలు మారినా ఫారెస్ట్ ఆఫీసర్ల అండదండలు ఉండటం వల్లే కలప స్మగ్లర్లకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయని అంటున్నారు. 

రెండేళ్లలో 193 మంది ఫారెస్టోళ్లపై యాక్షన్

మూడేళ్ల కిందట కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్‌‌‌‌గా సీపీ వినోద్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. తొలి ఏడాది కలప స్మగ్లింగ్‌‌‌‌పై సీరియస్‌‌‌‌గా దృష్టి పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు ఫారెస్ట్ సర్కిళ్ల పరిధిలో కలప స్మగ్లింగ్‌‌‌‌ను అరికట్టేందుకే ప్రత్యేకంగా 38 చెక్ పోస్టులున్నా, 800 మంది స్టాఫ్ పనిచేస్తున్నా అడవుల్లో టేకు చెట్లు ఎలా మాయమవుతున్నాయని అన్వేషించారు. చివరకు ఈ స్మగ్లింగ్ దందా వెనుక స్మగ్లర్ల అవతారం ఎత్తిన కొందరు పొలిటీషియన్లు, ఫారెస్ట్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోని ఇంటి దొంగల పాత్ర ఉందని తెలుసుకున్నారు. కలప స్మగ్లర్లను, వాళ్లకు సహకరిస్తున్న అధికారుల లిస్ట్‌‌‌‌ను తయారు చేసి వారి కదలికలపై నిఘా పెట్టారు. పక్కా ఆధారాలతో ఒక్కొక్కరిని రెడ్ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకుంటూ వేటేశారు. ఇలా గత రెండేళ్లలో 78 మంది ఆఫీసర్లను ఆయన సస్పెండ్ చేశారు. వీరిలో ఎఫ్‌‌‌‌డీవో స్థాయి ఆఫీసర్‌‌‌‌తో పాటు ఎఫ్‌‌‌‌ఆర్వోలు, బీట్ ఆఫీసర్ల దాకా ఉన్నారు.  మరో 115 మంది ఆఫీసర్లు, స్టాఫ్‌‌‌‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 

రూలింగ్‌‌‌‌ పార్టీ లీడర్ల ఒత్తిళ్లు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో మొదటి నుంచీ పనిచేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు, స్టాఫ్‌‌‌‌పై ప్రజాప్రతినిధులు, రూలింగ్​పార్టీ​లీడర్ల ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. అటు అడవుల్లో, ఇటు చెక్​పోస్టుల్లో లీడర్లు, వాళ్ల అనుచరుల కలప బండ్లు పట్టుబడినప్పుడు వదిలేయాలనే ఫోన్లు కామన్ అయ్యాయి. అలా చూసీచూడనట్టు వదిలేసిన కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు, స్టాఫ్ రెడ్ హ్యాండెడ్‌‌‌‌గా ఉన్నతాధికారులకు దొరికి సస్పెండ్ అవుతున్నారు. స్మగ్లింగ్ దందాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రూలింగ్​ పార్టీ లీడర్ల పాత్ర ఉంటోందని.. అలా ఉన్నంతకాలం ఎంతమందిపై చర్యలు తీసుకున్నా అడవుల నరికివేత ఆగదని అంటున్నారు.

ఇంటి దొంగల పని పడ్తున్నం

అటవీ శాఖలో పని చేస్తూ కలప స్మగ్లర్లకు సహకరిస్తున్న ఇంటి దొంగల పని పడ్తున్నం. ఇప్పటికే చాలా మందిపై యాక్షన్ తీసుకున్నం. స్మగ్లర్లకు ఎవరు సహకరించినా గట్టి చర్యలుంటయ్‌‌‌‌. 
- సీపీ వినోద్​కుమార్, ఫీల్డ్ డైరెక్టర్, కవ్వాల్